తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారా..? తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని శపథం చేసిన ఆయన..ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశారా..? కేసీఆర్ ముద్రను తొలగించేందుకు కౌంట్ డౌన్ కూడా మొదలైపోయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తెలంగాణ తల్లిగా కేసీఆర్ గుర్తించిన ప్రతిమతో పాటు అధికారిక చిహ్నంలో రేవంత్ సర్కార్ మార్పులు, చేర్పులను చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ తల్లిగా కీర్తించబడుతోన్న విగ్రహం తెలంగాణ సంప్రదాయాలను స్ఫూరించేలా లేదని…దొరసానిలా ఉందంటూ గతంలో రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లికి మరో విగ్రహాన్ని తయారు చేయిస్తున్న ఆయన… ఇటీవలే తుది రూపును ఖరారు చేసారు. రాష్ట్ర అధికారిక చిహ్నం విషయంలోనూ చిత్రకారుడు రుద్ర రాజేశ్‌తో చర్చలు జరిపిన రేవంత్..రాచరికపు ఆనవాళ్ళు లేకుండా పలు సూచనలు చేశారు..
ఇక తెలంగాణ రాష్ట్ర గీతంగా అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణకు స్వయంగా దగ్గరుండి స్వరకల్పన చేయిస్తున్నారు. అటు ఇప్పటికే తెలంగాణలోని వాహనాలు రిజిస్ట్రేషన్ కోడ్, ప్రభుత్వ సంస్థల పేర్లను టీఎస్ నుంచి టీజీకి మార్పించారు. అలాగే, తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ను బీఆర్ఎస్ కీర్తిస్తుండటంతో అందుకు కౌంటర్ గా జయశంకర్ పేరును తెరపైకి తీసుకొచ్చారు.. ఇలా తెలంగాణ రాష్ట్రమేర్పడి దశాబ్ద కాలం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణను బ్రాండ్ ను సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
మొత్తంగా వ్యూహంతోనే రేవంత్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారని.. తెలంగాణలో కేసీఆర్ ముద్రను లేకుండా చేసే పనిలో భాగంగానే ఈ విధానపరమైన మార్పులు చేయిస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది.