ఐపీఎల్ హంగామా అవ్వగానే టాలీవుడ్ కి మూడ్ వచ్చింది. వరుసగా సినిమాల్ని రంగంలోకి దింపే పనిలో పడింది. ఈ వారం ముచ్చటగా మూడు సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమయ్యాయి. విశ్వక్సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, కార్తికేయ ‘భజే వాయు వేగం’, ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేషా’ ఈ వారమే విడుదల కాబోతున్నాయి.
ఈమూడు సినిమాల్లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై ఎక్కువ ఫోకస్ ఉంది. స్టార్ కాస్టింగ్ అలా ఉంది మరి. విశ్వక్సేన్, అంజలి, నేహా శెట్టి.. ఇలా పోస్టర్ ఆకట్టుకొంది. విశ్వక్ పూర్తి మాస్ అవతార్‌లో కనిపిస్తున్న సినిమా ఇది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. యువన్ శంకర్ రాజా బాణీలు కూడా ఓకే అనిపించింది. ఓపాట ఇనిస్టెంట్ హిట్ అయ్యింది. ప్రమోషన్ స్టఫ్ కూడా క్రేజీగానే కనిపిస్తోంది. అందుకే మూడు సినిమాల్లో దీనికే ఎక్కువ ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది.
‘ఆర్.ఎక్స్.100’ తరవాత కార్తికేయ చెప్పుకోదగిన హిట్లు కొట్టలేకపోయాడు. కానీ మంచి ప్రయత్నాలే చేశాడు. ‘భజే వాయు వేగం’ కూడా విషయం ఉన్న కథలానే అనిపిస్తోంది. టీజర్, ట్రైలర్ లో ఆ లక్షణాలు కనిపించాయి. ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథ ఇది. ఆ బ్యాగ్ కోసం కొన్ని గ్యాంగ్‌లు హీరో వెంట పడతాయి. నాన్న ఎమోషన్ కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. కార్తికేయ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకొన్నాడు.
`బేబీ`తో సూపర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు `గం గం గణేషా`గా రాబోతున్నాడు. ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇదో దొంగ కథ. వినాయకుడి విగ్రహం చుట్టూ ఈ కథ నడుస్తుంది. అందుకే ఆ పేరు పెట్టారు. కామెడీ, సస్పెన్స్, ట్విస్టుల్ని ఈ సినిమా నమ్ముకొంది. ఈ మూడింటినీ ఎలా మిక్స్ చేశారన్నవాటిపైనే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంది. ఇదే వారం `సత్యభామ`, `హరోం హర` కూడా రావాల్సివుంది. కానీ.. అవి వెనక్కి తగ్గాయి.