దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ కేసు బిగ్ టర్న్ తీసుకునేలా కనపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలుపాలు కాగా… మాజీ సీఎం కేసీఆర్ కు ఈ స్కాం గురించి ముందే తెలుసంటూ కోర్టులో ఈడీ బాంబు పేల్చింది.
లిక్కర్ కేసులో జైల్లో ఉన్న కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత బెయిల్ విచారణ సందర్భంగా ఈడీ తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఓ మహిళ అన్న సాకుతో తనకు బెయిల్ ఇవ్వరాదని, అనేక కీలక పదవులతో పాటు కీలక సంస్థల్లో తాను ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారని… పైగా ఫైనాన్స్ లో ఎంఎస్ చేశారని ఈడీ కోర్టు దృష్టికి తెచ్చింది.
కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కవితకు లిక్కర్ స్కాం నుండి ముందే అవగాహన ఉందని… మాగుంట ద్వారా కవిత మొత్తం వ్యవహరం నడిపి 100కోట్లు సమకూర్చారని ఈడీ ఆరోపించింది. బుచ్చిబాబు మాగుంట నుండి ఎప్పుడు ఎక్కడ ఎన్ని కోట్లు తీసుకున్నారు, శరత్ చంద్రారెడ్డితో కవిత తన నివాసంలో ఏం చర్చించారు… అరుణ్ పిళ్లై ఎలా బినామిగా ఇండో స్పిరిట్ లో ఎంటరయ్యారు అన్న అంశాలను ఈడీ కోర్టు ముందు ఉంచింది.
అయితే, ఈ మొత్తం విషయం కేసీఆర్ కు తెలుసని… లిక్కర్ బిజినెస్ లో ఉన్న వారందరినీ కేసీఆర్ కు కవిత పరిచయం చేయగా, మద్యం పాలసీతో పాటు బిజినెస్ కు సంబంధించి కేసీఆర్ వారిని పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారని ఈడీ స్పష్టం చేసింది. మాగుంట టీంకు చెందిన గోపీ కుమరన్ ఈ మొత్తం విషయాలతో పాటు కేసీఆర్ బుచ్చిబాబు, సమీర్ మహేంద్రుతో మాట్లాడిన వివరాలను తన వాంగ్మూలంలో పొందుపర్చారు.
దీంతో… ఈడీ ఇప్పుడు కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చి, సాక్షిగా పిలిచే అవకాశం లేకపోలేదని… విచారణలో తేలిన దాన్ని బట్టి కేసీఆర్ ను సాక్షిగానే చూపిస్తారా? స్కాం కుట్రదారుల్లో ఒకరిగా మారుస్తారా…? అన్నది వేచి చూడాలి.