తెలంగాణ తెచ్చింది తామేనని .. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ బాపు అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ వచ్చారు కానీ.. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. తెలంగాణపై వారి ముద్ర లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. టీఎస్ అనే పేరు మార్చడం దగ్గర నుంచి అధికారిక చిహ్నం మార్పు వరకూ కేసీఆర్ ముద్ర లేకుండా తెలంగాణలో కొత్త రాజకీయం ప్రారంభించారు.
కవిత రూపంలో తెలంగాణ తల్లి ఉందని గతంలోనే విమర్శుల చేసిన రేవంత్ రెడ్డి . .. కొత్త తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేయించారు. పెత్తందార్లపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమస్ఫూర్తి కనిపించేలా విగ్రహం ఉండేలా రెడీ చేయిస్తున్నారు. తెలంగాణ చిహ్నంపై తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసి కొత్త చిహ్నం రెడీ చేయిస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి రాచరిక పోకడల్ని తీసేస్తామని ప్రకటించారు.
కాకతీయ కళాతోరణాన్ని కూడా ఆయన రాచరిక పోకడగానే చెబుతారు. ప్రస్తుతం తెలంగాణ చిహ్నంలో ఉన్న ఆ తోరణాన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని గమనించి బీఆర్ఎస్ పార్టీ నేతలు.. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ చిహ్నంలోనుంచి తీసేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అందెశ్రీ గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించి సోనియాచేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నారు. ఆస్కార్ గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఎలా చూసినా తెలంగాణ ఇచ్చింది.. కాంగ్రెస్ అనే ముద్ర మాత్రమే ఉండేలా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీన్ని కౌంటర్ చేసే పరిస్థితిలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ లేదు.