పార్టీ జన్మస్థానం తెలంగాణలో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు ఇంకా తత్త్వం బోధపడినట్లు లేదు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అంచనా వేయకుండా మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై ఫోకస్ పెడుతుండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
మరో నాలుగు నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎనికలు జరగనున్నాయి. తెలంగాణలో అధికారం కోల్పోవడంతో మహారాష్ట్రలోని తెలుగు వారున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావడి నెలకొనే అవకాశం ఉంది. కానీ వీటిపై దృష్టి పెట్టకుండా మహారాష్ట్ర ఎన్నికలపై ఫోకస్ పెట్టడం పార్టీ వర్గాలను సైతం నివ్వెరపోయేలా చేస్తోంది.
బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం కోల్పోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మహారాష్ట్రకు చెందిన లీడర్లు ఆ పార్టీని వీడారు. అయినా అక్కడ సత్తా చాటాలని పాకులాడి తెలంగాణలో ప్రభావం కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ, వీటిని గమనంలోకి తీసుకోకుండా బీఆర్ఎస్ మహారాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించడం వెనక ఎదో గట్టి మతలబు ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శివసేన – కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీతో చేతులు కలిపి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో..వారికి ప్రయోజనం చేకూర్చేలా ఓట్ల చీలిక కోసం బీఆర్ఎస్ పోటీకి సై అంటుందా అన్న చర్చ జరుగుతోంది.