లే ఆఫ్ .. ఇప్పుడీ మాట ఐటీ రంగంలో పెనుప్రకంపనలు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా బడా కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు కానీ.. భారత ఐటీ రంగంలోనూ ఈ లేఫ్స్ ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నాయి. 2023లో ఇరవై వేల మందిని ఐటీ కంపెనీలు తొలగించాయి. ఈ ఏడాది నాలుగు నెలల కాలంలోనే మూడు వేల మంది తమ ఉద్యోగాల్ని కోల్పోయారు.
సైలెంట్ లే ఆఫ్స్‌కు పాల్పడుతున్న కంపెనీలు
ఉద్యోగుల్ని తొలగించడానికి కంపెనీలు పెద్ద కసరత్తు చేయడం లేదు. ఎవర్ని తొలగించాలనుకుంటే వారిని మీటింగ్ కు ఆహ్వానిస్తున్నారు. అది ఆన్ లైన్.. ఆఫ్ లైన్ అయినా సరే పిలిచి రెండే ఆప్షన్లు ఇస్తున్నారు. అతి తక్కువ పే ఔట్ ఇచ్చి టెర్మినేట్ చేయాలా లేకపోతే నాలుగు నెలల శాలరీ ఇస్తాం రాజీనామా చేస్తావా అనే రెండు ఆప్షన్లు ఇస్తున్నారు. మొదటి దాని కన్నా రెండోది కాస్త గౌరవం ఉంటుందని… చెప్పి ఉద్యోగులు రెండో దానికే ఓటేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి పెద్దగా సమయం కూడా ఇవ్వడం లేదు. ఇలా చేయడం లే ఆఫ్ ప్రకటించడం కన్నా రాజీనామా చేయడం కిందకే వస్తుంది. అందుకే వీటి గురించి బయటకు రావడం లేదు. సైలెంట్ లే ఆఫ్‌గా మారిపోతోంది.
తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఐటీ ఉద్యోగులు
కొన్ని కంపెనీలు అదే కంపెనీలో ఉన్న ఓపెనింగ్స్‌లో జాబ్ తెచ్చుకునేందుకు ఓ ముఫ్ఫై రోజుల సమయం ఇస్తున్నాయి. తెచ్చుకుంటే సరే లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెబుతున్నాయి. రిలీవింగ్ లెటర్ లో టెర్మినేటెడ్ అని ఉండటం కన్నా… రాజీనామా చేసినట్లుగా ఉండటం బెటరని ఎక్కువ మంది సైలెంట్ లే ఆఫ్స్‌కు అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితి ఐటీ ఉద్యోగుల్లో ఒత్తిడి పెంచుతోంది. తమ టార్గెట్లను అందుకోవడానికి .. లే ఆఫ్ బ ారిన పడకుండా ఉండటానికి చాలా మంది పన్నెండు నుంచి పధ్నాలుగు గంటలు పని చేస్తున్నారు.
2007-08 తర్వాత ఇప్పుడే ఎక్కువ !
బడా కంపెనీల లేఆఫ్‌ల ప్రభావం మధ్యస్థ కంపెనీలపై పడుతోంది. ఐటీ రంగంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ సైలెంట్ లే ఆఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 2007-08లో మాంద్యం కారణంగా అత్యధిక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.