బిల్ కలెక్టర్ నుంచి ఏసీపీ వరకూ ఎవరైనా లంచం తీసుకున్నారని ఫిర్యాదు వచ్చినా… తీసుకుంటున్నారని సమాచారం వచ్చినా ఏసీబీ అధికారులు వదిలి పెట్టడం లేదు. ట్రాప్ చేసి పట్టేసుకుంటున్నారు. హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ బాలకృష్ణ , ఏసీపీ ఉమామహేశ్వర్ రావు లాంటి పెద్ద చేపల్ని పట్టుకుని జైలుకు పంపిన ఏసీబీ … చిన్న చిన్న లంచాలే కదా అని కింది స్థాయి వారిని ఉపేక్షించడం లేదు. అవినీతి అనే క్యాన్సర్ ను మొదలకంటా తుడిచేయాల్సిందేనన్న ఉద్దేశంతో అందర్నీ ప ట్టేసుకుంటున్నారు.
ఆదిలాబాద్ నుంచి ఎల్బీనగర్ వరకు ఏ మున్సిపాలిటీలో అయినా లంచం తీసుకుంటున్నారని సమాచారం వస్తే ప ట్టేసుకుంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కనీసం అరవై కేసుల్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఎంత మొత్తం అవినీతి అని కాదు.. లంచం అనే మాట వినిపిస్తే దూకుడుగా వెళ్లి అవినీతి పరుల్ని పట్టుకుంటున్నారు. గత ఐదేళ్లుగా ఏసీబీ నిద్రావస్థలోనే ఉంది. అడపాదడపా దాడులు చేయడం తప్ప.. సంచలనాత్మకంగా ఎవర్నీ పట్టుకోలేకపోయారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ ను నియమించారు. ఆయన సిన్సియారిటీ గురించి … పోలీసు వ్యవస్థలో అందరికీ తెలుసు. సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఏసీబీ ఇమేజ్ మారిపోయింది . ముందు ముందు ఇంకెన్ని సంచలన కేసులు వెలుగులోకి తెస్తుందో కానీ.. ఇప్పటికి మాత్రం ఏసీబీ అంటే.. ఉద్యోగులు హడలి పోతున్నారు. లంచాల ప్లాన్లు ఉంటే.. ఇప్పుడే వద్దనుకుంటున్నారు.