కంపెనీలో అయినా.. ఉద్యోగంలో అయినా.. పార్టీలో అయినా.. ఎక్కడైనా పట్టు పరిశ్రమ బ్యాచ్ ఒకటి ఉంటుంది. అసలు పని చేయడం కన్నా.. పెద్దల్ని పొగిడేసి.. వారి విధేయులమని నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించి … అసలు పని చేసే వారి కన్నా వేగంగా పైకెదిగిపోతూంటారు. ఇలాంటి వారు రాజకీయ పార్టీల్లో ఎక్కువ ఉంటారు. తాజాగా టీడీపీలో అలాంటి వారి హడావుడి ప్రారంభమయింది.
లోకేష్‌కు పగ్గాలివ్వాలని బుద్దా వెంకన్న తెర ముందుకు వచ్చేశారు. తాను రక్తతర్పణం చేశానని.. తనంత విధేయుడు మరొకరు ఉండరని ఆయన చెప్పుకొస్తున్నారు. తాను హనుమంతుడినని ఆయన ఫీలింగ్. ఇది కూడా ఆయనే చెప్పుకున్నారు. ఇదంతా ఎందుకంటే.. గెలుస్తున్నాం కాబట్టి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని సంకేతాలు పంపడం. తన కంటే విధేయులు ఎవరూ లేరని స్వయం సర్టిఫికెట్లు జారీచేసుకోవడం.
పార్టీ అధికారంలోకి వస్తే.. కష్టపడిన వారిని గుర్తించి ప్రాధాన్యత ఇస్తూంటారు. అయితే ఇలా కాకా పట్టే బ్యాచ్ కూడా ఒకటి సమాంతరంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. బుద్దా వెంకన్న కూడా తాను పార్టీ కోసం పని చేయలేదా అని.. ప్రశ్నించవచ్చు.. నిజంగా ఆయన పార్టీ కోసం గట్టిగా పని చేస్తే ఇలాంటి వివాదాలు పెట్టుకుని.. విధేయతా ప్రదర్శనతో పార్టీ గెలవక ముందే … తనకు పదవులు కావాలని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయరు. చేసిన దానికి గుర్తింపు వస్తుందని అనుకుంటారు. గతంలో తనకు అలాగే ఎమ్మెల్సీ ఇచ్చారనే సంగతిని బుద్దా వెంకన్న మర్చిపోతే ఎలా ?