బాలకృష్ణ… మాట మామిడల్లం. మనసు పటిక బెల్లం. ఆయన ఏది చెప్పినా మనసు నుంచే వస్తుంది. కొన్నిసార్లు ఆయన మాటలు ఘాటుగా అనిపిస్తాయి. ఇంకొన్ని సార్లు భోళాగా వుంటాయి. ఏదేమైనా నిజాల్ని నిర్మోహమాటంగా చెప్పడంలో ఆయన రూటే వేరు. తాజాగా జరిగిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా వేడుకలో ఆయన ఇచ్చిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
ముఖ్యంగా తనయుడు మోక్షజ్ఞని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అభినందనీయంగా వుంది. ‘మొక్షు కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. అయితే నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దని తనకి చెప్తాను. ఇది అభిమానులని బాధించవచ్చు. కానీ.. మొక్షు, విశ్వక్, అడివి శేష్, సిద్దు లాంటి యువ నటులని స్ఫూర్తిగా తీసుకోవాలి. నటులు నిత్యావసర వస్తువుల్లా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి’ అని చెప్పారు బాలయ్య.
ఇండస్ట్రీకి నాలుగు స్తంభాల లాంటి హీరోల్లో బాలయ్య ఒకరు. సోషల్, మైథాలాజికల్, హిస్టారికల్..ఇలా అన్నీ జోనర్ పాత్రలకు చక్కగా సరిపోయే హీరో బాలయ్య. అలాంటి బాలయ్య.. తనని స్ఫూర్తిగా తీసుకోవద్దని చెప్పడం.. యువతరానికి, యువ నటులకు, మారుతున్న ప్రేక్షకులు అభిరుచులకు ఆయన ఇచ్చే ప్రాధాన్యతని అద్దం పడుతోంది. వాస్తవం కూడా ఇదే. కాకపొతే అందరూ ఇలా వాస్తవాలని బహిరంగ వేదికలపై చెప్పలేరు. కానీ బాలయ్యది అలాంటి సంకుచిత మనస్తత్వం కాదు. అందుకే ఫ్యాన్స్ గుండెల్లో జై బాలయ్య నినాదం అంతలా పాతుకుపోయింది.