ఏపీలో ప్రభుత్వ మార్పు ఖాయంగా కనిపిస్తుండటంతో చంద్రబాబు సారధ్యంలోని కూటమి సర్కార్ కు పెను సవాళ్ళు ఎదురు కానున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే పెద్దమొత్తంలో నిధులు అవసరం. ఓ వైపు సంక్షేమాన్ని కొనసాగిస్తూనే మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టించడం ఏమాత్రం ఆషామాషీ కాదు.
కొత్త ప్రభుత్వం పాలనపై పట్టు బిగించి ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చాలంటే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే సుమారు రెండేళ్ల సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే ఏపీ సర్కార్ కు 12లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ అప్పును భరించాల్సింది కొత్త ప్రభుత్వమే కావడంతో అప్పును తగ్గించుకుంటునే అభివృద్ధిపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రాజధానిగా అమరావతిని డెవలప్ చేయడంతో పాటు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం చంద్రబాబుకు కత్తి మీద సాములాంటిదే.
అయితే, హామీలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో చంద్రబాబుకు స్పష్టమైన క్లారిటీ ఉందని అంటున్నాయి టీడీపీ వర్గాలు. గత ప్రభుత్వం సంపద సృష్టించడంపై ఫోకస్ పెట్టకపోవడం వలనే రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని విమర్శిస్తున్నాయి. కానీ, సంపదను సృష్టించడంలో చంద్రబాబు మేటి అని… సంపదను సృష్టించి ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.