ఎన్నికల షెడ్యూల్ వచ్చే మూడు నెలల ముందు అంటే గత డిసెంబర్లో ప్రభుత్వం జీవో నెంబర్ 596 విడుదల చేసింది. ఈ జీవో సారాంశం ఏమిటంటే అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించడం. అంటే దళితులు ఇతర వర్గాలకు జీవనోపాధి కోసం ఇచ్చిన భూములను పెద్దలు తక్కువను కొంటే వాటిని వారికే క్రమబద్దీకరిస్తారన్నమాట. ఈ జీవో విడుదల చేయడానికి ముందు విశాఖ, విజయనగగరం, బోగాపురం ప్రాంతాల్లో అసైన్డ్ ల్యాండ్స్ పై గద్దలు వాలిపోయాయి. అధికారికంగా వాటికి రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి.. ఆ అసైన్డ్ ల్యాండ్ ఓనర్లను భయపెట్టి… ఎకరం ఐదు లక్షలకు చొప్పున అమ్మకానికి ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటుందనో… సెంటు స్థలాలకో ఇచ్చేస్తామని చెప్పి బెదిరించి అమ్మకానికి ఒప్పందాలు చేసుకున్నారు. ఇందు కోసం ప్రత్యేమైన ముఠాలు విశాఖ ప్రాంతంలో తిరిగాయి.
వీరి వెనుక పెద్దలు లేకపోతే అంత సాఫీగా సాగిపోయే అవకాశాలు లేవు. కొనుగోళ్లు అయిపోయిన తర్వాత ఇక తమకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జీవో నెంబర్ 596 రిలీజ్ చేశారు. ఓ వైపు ఎన్నికల పనులు చురుకుగా ఉన్నా… తమ పనులు మాత్రం ఆపలేదు. సీఎస్ జవహర్ రెడ్డి ఒకటి , రెండు సార్లు విశాఖ వచ్చారని అనుకున్నారు. కానీ ఆయన చాలా తరచూ విశాఖ వచ్చారు. ఆయన తరపున బినామీగా వ్యవహరించిన సత్యకృష్ణంరాజు అనే వ్యక్తి చనిపోవడతో… ఇప్పుడు ల్యాండ్స్ అన్నీ తన మరో బినామీ పేరు మార్చుకోవడానికి ఆయన తంటాలు పడుతున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపణ. దీనికి సీఎస్ స్పందిస్తున్న తీరు చూస్తేనే కిందామీదా పడుతున్నారని అర్థమవుతుంది.
బడుగు బ లహీనవర్గాలకు జీవనోపాధి కింద ఇచ్చిన భూములు కొనడం, అమ్మడం నేరం. అలా కేంద్ర చట్టాలున్నాయి. కానీ తమ వారితో కొనిపించి రిజిస్ట్రేషన్ చేయించుకునే జీవోలు జారీ చేసుకోవడం.. దోపిడి దొంగల ప్రభుత్వంలోనే సాధ్యం. బడుగు, బలహీనవర్గాలను దోచుకుని… ఎంత వెనకేసుకుంటారో కానీ… ప్రభుత్వం మారగానే ఈ అంశంపై పెద్ద ఎత్తున విచారణ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. రాజధాని పేరుతో గత ఐదేళ్లలో విశాఖలో చేసిన దందాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.