అమరావతి విషయంలో అధికారులు తీరు మార్చుకున్నారు. అమరావతి నిర్మాణం కోసం తెచ్చి గత ఐదేళ్లుగా మూలన పడేసిన అత్యాధునిక సామాగ్రిని కాంట్రాక్టు పొందిన సంస్థలు ఇతర చోట్లకు తరలిస్తున్నాయి. వీటిని తరలించేసుకోవాలని గతంలో ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక.. తరలించాలని కొంత మంది ఉన్నతాధికారులు ఆదేశించడంతో తరలిస్తున్నారు.
ఈ విషయంపై మీడియాలో ప్రచారం జరగడం .. అధికారులు ఇప్పటికీ మారలేదా అన్న ప్రశ్నలు వినిపించడం తో సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వెంటనే స్పందించి తరలింపుల్ని ఆపేశారు. వివేక్ యాదవ్ ప్రస్తుతం బెంగాల్ లో ఎన్నికల పరిశీలకునిగా ఉన్నారు. ఆయనకు తరలింపుపై స్పష్టత లేదు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంజినీర్లను అప్రమత్తం చేసి సామాగ్రి అంతా వెనక్కి తెప్పించాలని ఆదేశించారు. ఆ ప్రకారం తెప్పించారు కూడా.
వివేక్ యాదవ్ వైసీపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితుడు. అమరావతి నిర్వీర్యంలో ఆయనది కీలక పాత్ర. రోడ్లు తవ్వుకుపోతున్నా గతంలో పట్టించుకోలేదు. రైతులకు కౌలు కూడా ఇవ్వలేదు. అయినా ప్రభుత్వం మారుతుందేమోనన్న భయంతో ఆయన సామాగ్రిని మళ్లీ వెనక్కి తెప్పించారని అంటున్నారు.