సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్… ఎన్నో పదవులు చేసిన అనుభవం… కానీ 5 ఏండ్ల కక్షసాధింపు ఎండ్ కార్డ్ పడుతుందని భావించాలా, ఒక్క రోజైన పూర్తిగా ఉద్యోగం చేయకుండానే రిటైర్ కావాల్సి వస్తుందనుకోవాలా…
ఏబీవీ వెంకటేశ్వరరావు. గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ పై ప్రతిపక్ష పార్టీలది ఒకరమైన పోరాటం అయితే తనది మరోరకమైన పోరాటం. జగన్ సీఎం కాగానే మరుసటి రోజే మొదలైంది. సరిగ్గా ఐదేండ్ల క్రితం… రాగానే సస్పెన్షన్. పాపం ఆ అధికారి ఎక్కని కోర్టు మెట్లు లేవు. క్యాట్ నుండి సుప్రీం కోర్టు వరకు జగన్ సర్కార్ కక్షసాధింపులపై పోరాడారు. చివరకు గెలిచారు.
నిజానికి తనకు ఈరోజే ఆఖరు. ఈరోజుతో రిటైర్ కావాల్సి ఉంది. సస్పెన్షన్ లోనే రిటైర్మెంట్ పూర్తి చేయాలని సర్కార్ తో పాటు ప్రభుత్వంలోని పెద్దలు చాలా ప్రయత్నించారు. క్యాట్ ఉత్తర్వులున్నా, హైకోర్టుకు వెళ్లి కాలాయాపన చేసే ప్రయత్నం చేశారు. కానీ కోర్టు ఏబీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పుల కాపీలు కూడా ఆలస్యం చేస్తారన్న ఉద్దేశంతో సీనీయర్ ఐపీఎస్ ఏబీ స్వయంగా ఆ ఉత్తర్వులను ఈసీకి, సీఎస్ కు అందించారు.
చివరకు సీఎస్ పోస్టింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ అయ్యింది. తన పోరాటం తన చివరి రోజు సక్సెస్ అయ్యింది. ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా సాయంత్రమే తను రిటైర్ కాబోతున్నారు. నిజానికి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి తనకు పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయని లేదంటే ఈ సర్కార్ పెద్దలు ఇంకా సాగదీసే వారు అన్న అభిప్రాయం ఉద్యోగుల్లో నెలకొంది.
5 ఏండ్ల పోరాటం… వ్యవస్థలతో కొట్లాట… అయినా ఏబీ గెలిచారు.