వైసీపీ పూర్తి స్థాయిలో ఫ్రస్ట్రేట్ అవుతోంది. జగన్ కన్నా ఎక్కువ అధికార యంత్రాంగంపై పట్టు సాధించిన సజ్జలపైనే క్రిమినల్ కేసు పెట్టేశారన్న అసహనం.. అధికారులు ఎవరూ తమ మాట వినడం లేదన్న కోపంతో ఫ్రస్ట్రేషన్ తన్నుకొచ్చేస్తోంది. అధికారులందరి సంగతి తెలుస్తామని హెచ్చరిస్తున్నారు.
ఓ వైపు ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందని రోజూ ఆరోపిస్తున్నారు. ఫలితం అనుభవిస్తారని బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరికి కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో సజ్జల చేసిన సూచనలతో వారిలో ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతోంది. పోస్టల్ బ్యాలెట్స్ ను కొన్నింటిని అయిన చెల్లకుండా చేయాలన్న లక్ష్యంతో చేసిన కుట్రలు ఫెయిల్ కావడంతో మరింత అసహనానికి గురవుతున్నారు.
పోలింగ్ అనంతరం ఘర్షణల తర్వాత ఏపీపై అందరి దృష్టి పడింది. ఈసీ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. కౌంటింగ్ అనంతరం చిన్న ఘర్షణ జరిగినా ఊరుకునేది లేదని హెచ్చరించింది. పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను రాష్ట్రానికి పంపింది. అల్లరి చేస్తారని ఆరోపణలు ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. వీటన్నింటినీ తట్టుకోలేకపోతున్నారు.
నిజానికి ఇలాంటి పరిస్థితి గత ఎన్నికల్లో టీడీపీ ఎదుర్కొంది. 2019లో తెలుగుదేశం అధికార పార్టీనే. అయినా ఆ పార్టీకి చెప్పినట్లుగా ఎవరూ వినలేదు. ఇప్పుడు వైసీపీది అదే పరిస్తితి. ఇప్పుడే ఏముందని ముందుంది ముసళ్ల పండగ అని వైసీపీ నేతలకు.. టీడీపీ నుంచి హెచ్చరికలు వెళ్తున్నాయి. రేపనేది లేదన్నట్లుగా ఐదేళ్లు చేసిన అరాచకాలకు బదులిస్తామని అంటోంది.