ఆంధ్రప్రదేశ్ 2016-17 బడ్డెట్ లో కూడా గతరెండేళ్ళ బడ్జెట్ల మాదిరిగానే మౌలిక మైన మార్పులు లేవు. ఉత్తేజభరితమైన చేర్పులూ లేవు. (తెలుగు360డాట్ కామ్ ఇప్పటికే చెప్పినట్టు ) పోలవరం ప్రాజెక్టుకి 3600 కోట్లరూపాయలు, అమరావతి నిర్మాణానికి 1500 కోట్లరూపాయలు సొంత నిధుల నుంచి కేటాయించుకోవడం మినహా భారీ మార్పులేమీ బడ్జెట్ లో లేవు. కొత్త పన్నులు లేవు…అదే సమయంలో అనేక సంస్కరణలు అమలు చేయనున్నాయని ఆర్ధిక మంత్రి ప్రకటించడాన్నిబట్టి ప్రత్యక్ష లేదా పరోక్ష ఆర్ధిక భారాలు తప్పవని కూడా అర్ధమౌతోంది.
సంస్కరణలకు అనుగుణంగా ఆదాయ వ్యయాలు లెక్కవేసుకోవలసిన ఆర్ధిక నేపధ్యం లో కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్టులన్నీ ఇంతే పేలవంగా వుంటున్నాయి.అయినా కూడా అరుణ్ జైట్లీ లోక్ సభలో బడ్జెట్టు ఉపన్యాసం చేస్తున్నపుడు పాలక పక్షాల నుంచి పదేపదే చప్పట్లు వినిపించాయి. రాష్ట్ర శాసనసభలో యనమల రామకృష్టుడు బడ్జెటు చదువుతున్నపుడు కేవలం మూడేసార్లు కొద్దిపాటి చప్పట్లు మోగాయి.
కేంద్ర సహాయం రాష్ట్ర అవసరాలకు అందకపోతున్నప్పటికీ నిస్సహాయంగా నిలబడిపోకుండా సొంత నిధులతో ముందుకి వెళ్ళాలనుకోవడం కొంత సాహసమే…రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు 16 శాతం పెరగటమే ఇందుకు దారిచూపింది.
రెండు అంకెల అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
2016-17 సంవత్సరానికి 1,35688.99 కోట్ల రూపాయలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ రోజు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో ప్రణాళికా వ్యయం49, 134.44 కోట్ల రూపాయలు కాగా, ప్రణాళికేతర వ్యయం 84, 544 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. కాగా ఆర్థిక లోటు 20, 497.15 కోట్ల రూపాయలు ఉండగా, రెవెన్యూ లోటు 4.868.2 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. 16,250 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శాసన సభలో ప్రవేశపెట్టారు.
వ్యవసాయ బడ్జెట్టును మంత్రి తెలుగులో చదవగా అంతకు ముందు రాష్ట్రబడ్జెట్ ప్రతిపాదనలను ఆర్ధిక మంత్రి ఇంగ్లీషులో చదివారు. అంతకుముందు కేబినెట్ సమావేశం బడ్జెట్టు ను ఆమోదించింది. దీన్ని e బడ్జెట్టుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. బడ్జెట్టును కంప్యూటరించడానికి తెలుగు భాష ను సిద్దం చేసుకోకపోవడం వల్లే యనమల ఇంగ్లీషులో బడ్జెట్ ప్రతిపాదనలను చదివారని అర్ధమౌతోంది.
రాష్ట్రంలో కాగితరహిత పాలన ఉంటుందని కూడా ఆర్థికమంత్రి యనమల అన్నారు.కాగితాలతో నిమిత్తం లేకుండా సచివాలయంలో ఈ ఆఫీస్ ఉంటుందని, రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ విధానం విస్తారిస్తామని చెప్పారు. మీ సేవతోపాటు బీ2సీ, జే2సీ సేవలను సముచితమైన ధరలో అందించేలా ‘మొబైల్ మీ సేవ’ సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రగతి పేరిట ఏపీ స్టేట్ ఎంటర్ ప్రైజెస్ ఆర్కిటెక్చర్ అమలు చేస్తామన్నారు. రూ.2,398కోట్ల అంచనాతో 33శాఖలు, 315 సంస్థలకు చెందిన 745 సేవలను ఈ ప్రగతిలో భాగంగా రెండేళ్లలో అనుసంధానం చేస్తామన్నారు. స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డ్ కార్యక్రమంలో రూ.301 కోట్ల వనరులు సమకూరాయని చెప్పారు. అన్ని సేవలు కలిపి 2016-17లో పది లక్షల కార్డులుఇవ్వాలని సంకల్పించినట్లు తెలిపారు.
దీన్ని బట్టి ప్రభుత్వ లావాదేవీలు, ప్రభుత్వ శాఖలతో ప్రజల లావాదేవీలు భవిష్యత్తులో ఇంగ్లీషుకి మాత్రమే పరిమితమైపోతాయని కూడా అర్ధమౌతోంది.