ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సప్లిమెంటరీ చార్జీషీట్ ను దాఖలు చేసిన ఈడీ మరోసారి సంచలన అభియోగాలను నమోదు చేసింది. ఈ లిక్కర్ స్కామ్ లో 1100 కోట్ల వ్యాపారం జరిగిందని , అందులో 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్ పొందిందని, 100 కోట్ల ముడుపులను ఆప్ కి ఇచ్చారని ఈడీ తెలిపింది.
292కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని చార్జ్ షీటులో పేర్కొన్న ఈడీ… వీటన్నింటి వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి నేరుగా 581 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. మద్యం పాలసీ రూపొందించే క్రమంలో కవిత కోసం 10 లక్షల ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేశారని… ఈ మద్యం కేసులో తన పాత్ర లేకుండా చేసేందుకు డిజిటల్ ఆధారాలను కవిత ధ్వంసం చేసిందని ఈడీ ఆరోపించింది.
లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందు అనేకసార్లు విజయ్ నాయర్ తో కవిత సమావేశ అయ్యారని వెల్లడించింది. ఇండో స్పిరిట్ కంపెనీలో 100 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇండో స్పిరిట్ కంపెనీలో సౌత్ గ్రూప్ వాటా 65శాతం అని, ఇందులో కవిత పాత్రపై ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల స్టేట్ మెంట్లను చార్జీ షీట్లలో ఈడీ ప్రస్తావించింది. విచారణ సందర్భంగా కవిత తప్పుడు సమాచారం ఇచ్చారని, 9 మొబైల్ ఫోన్లను ఆమె ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది.