ఏపీలో వైసీపీ పునాదులు కదిలిపోయాయి. అసెంబ్లీ ఎన్నిక్లలో వై నాట్ 175 అంటూ అతి రాజకీయం చేసిన వైసీపీకి, జగన్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. అలా ఇలా కాదు..మళ్లీ కోలుకుంటారనే నమ్మకం లేకుండా ఓడించారు. అతి కష్టం మీద ఆ పార్టీ 14 సీట్లలో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. అంటే 152 స్థానాల నుంచి 14 సీట్లకు పడిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ 134 స్థానాలలో గెలిచే అవకాశం ఉంది. కొన్ని స్థానాల్లో ఆధిక్యతలు స్వల్పంగా నమోదవుతున్నాయి. ఈ కారణంగా ఒకటి రెండు సీట్లు అటూ ఇటూ మారవచ్చు.
మొదటి రెండు రౌండ్ల నుంచే వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ సెంటర్ల నుంచి పారిపోవడం ప్రారంభించారు. ఆధిక్యతలు ఆ స్థాయిలో ఉన్నాయి. ప్రతీ రౌండ్లోనూ ప్రతి అభ్యర్థికి్ వెయ్యికి పైగా మెజార్టీలు వచ్చాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ అసలు వైసీపీ అభ్యర్థులు పోటీ కూడా ఇవ్వలేకపోయారు. యాభై వేల మెజార్టీలు వచ్చిన నియోజకవర్గాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కౌంటింగ్ మొదలయిన కాసేపటికే వైసీపీ షాక్ లోకి వెళ్లిపోయింది. తమపై అంత వ్యతిరేకత ఉందా అని అర్థం అయ్యే సరికి ఇందరూ ఇంటి దారి పట్టారు.
గత ఎన్నికల్లో వైసీపీ ఎంత భారీ విజయాన్ని సాధించిందో.. ఈ సారి అంత కంటే ఎక్కువగా ఘోర పరాజయం పాయింది. ఎక్కడా కూా గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అభ్యర్థులు డీలా పడిపోయారు. మూడు రౌండ్ల తర్వాత వరుసగా కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయారు. కౌంటింగ్ ఏజెంట్లు కూడా తర్వాత వెళ్లిపోవడంతో .. వైసీపీ తరపున ఓట్ల లెక్కింపును కూడా పర్యవేక్షించేవారు లేకపోయారు.