రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతులు ఉంటారు. పట్టుబట్టి వెదుక్కుని మరి ఓడిపోయే పార్టీ తరపున పోటీ చేస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు చలమల శెట్టి సునీల్. బాగా డబ్బు చేసిన ఫ్యామిలీ నుంచి.. గ్రీన్ కో అనే కంపెనీ భాగస్వాముల్లో ఒకరిగా ఉన్న చలమలశెట్టి సునీల్.. రాజకీయంగా అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్రజారాజ్యం టైం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆయన దురదృష్టం ఏమిటో కానీ.. కనీసం సానుభూతి కూడా కలసి రావడం లేదు.
మొదటి సారి పీఆర్పీ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. రెండో సారి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మూడో సారి టీడీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. నాలుగో సారి మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఆయన పార్టీలోకి వస్తే టిక్కెట్ ఇచ్చేందుకు చాలా పార్టీలు రెడీగా ఉంటాయి. అయితే ఆయన ఓడిపోయే పార్టీని ఎంచుకోవడమే సమస్యగా మారుతోంది.
టీడీపీ, జనసేన పొత్తులతో అసలు కాకినాడలో గెలిచే చాన్సే లేదని.. సానుభూతి కన్నా జగన్ పై కోపమే ప్రజల్లో ఎక్కువగా ఉందని అంచనా వేయలేకపోయారు. మూడు సార్లు ఓడించినందున కనీసం సానుభూతితో అయినా గెలిపిస్తారని అనుకున్నారు. కానీ అలాంటి అవకాశమే లేకుండా పోయింది. లమరోసారి ఓడిపోయారు. చేతిచమురు వదిలించుకోవాల్సి వచ్చింది.