తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనుకున్నట్లుగానే బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటాగా సాగాయి. చివరికి రెండు పార్టీలు చెరో ఎనిమిది సీట్లను గెల్చుకున్నాయి. మజ్లిస్ పార్టీ తన హైదరాబాద్ సీటును నిలబెట్టుకుంది. బీఆర్యఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. రెండు, మూడు చోట్ల మినహా అన్ని చోట్ల మూడో స్థానంలో ఉంది. చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది.
కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అంటే.. కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే యాడ్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ కు అధికారికంగా అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారు. బీజేపీ కాంగ్రెస్ కన్నా ఒకటి , రెండు సీట్లలో ఎక్కువ సాధించి ఉన్నట్లయితే..ఆ పార్టీ నుంచి కాపాడుకోవడం కష్టమయ్యేది. అయితే ఇప్పుడు కేంద్రంలోనూ బీజేపీ బలహీన ప్రభుత్వమే ఏర్పడుతోంది. మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. అందుకే వారు తెలంగాణ ప్రభుత్వం జోలికి వచ్చే అవకాశం లేదు.
మరో వైపు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఫలితాలు ఇబ్బందికరమే. ఆయనపై హైకమాండ్ కు పార్టీ నేతలు లేనిపోనివి చెప్పుకోవడానికి ఎక్కువ అవకాశాలు కల్పించినట్లవుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచినా పార్టీ ఓడిపోయింది. డీకే అరుణకు.. బీఆర్ఎస్ పార్టీ సహకరించడమే కారణం. అలాగే తన సిట్టింగ్ సీటు మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలు రేవంత్ ను గట్టెక్కించాయని అనుకోవచ్చు.