పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు అనగానే అందరి దృష్టీ.. అటువైపు మళ్లింది. ఏపీ రాజకీయాల్లోనే పిఠాపురం సెంట్రాఫ్ అట్రాక్షన్ అయి కూర్చుంది. పవన్‌ని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూదనుకొన్న వైకాపా పవన్‌ని ఓడించడానికి భారీ ప్లానింగులు వేసింది. బలమైన ప్రత్యర్థి వంగా గీతను రంగంలోకి దించింది. అంతే కాదు. ముగ్గురు మంత్రులు పిఠాపురంలోనే తిష్ట వేశారు. కోట్ల రూపాయలు వెదజల్లారు. జగన్ కూడా ప్రచార ఘట్టాన్ని పిఠాపురం సభతో ముగించారు. `వంగా గీత గెలిస్తే ఉప ముఖ్యమంత్రి చేస్తా` అంటూ తాయితాలు గుప్పించారు. కానీ పిఠాపురం ప్రజలు పవన్ కల్యాణ్‌కే పట్టం కట్టారు. ఏకంగా 70 వేల మెజార్టీతో గెలిపించారు. పవన్‌ని అసెంబ్లీలో చూడాలన్న అశేఖ అభిమానుల కలని పిఠాపురం ప్రజలు ఈరోజు నిజం చేశారు.
అయితే పవన్ గెలుపులో చాలామందికి వాటా ఉంది. ముఖ్యంగా ఆ నియోజక వర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా నిలబడిన వర్మ చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదు. పొత్తు రాజకీయం కోసం పవన్ త్యాగం చేస్తే, పవన్ కోసం వర్మ తన సీటు త్యాగం చేశారు. అంతే కాదు, వైకాపా నేతలు వర్మని లాగేసుకొందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా, వర్మ పార్టీ మారుతున్నాడు, పవన్‌కు వెన్నెపోటు పొడవబోతున్నాడు అని ఎన్ని పుకార్లు రేపినా, వర్మ పవన్‌ని వదల్లేదు. `పవన్‌ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి తీరుతా` అని కంకణం కట్టుకొని మరీ… ప్రజల్లోకి వెళ్లాడు వర్మ. పవన్‌కు హీన పక్షం 60 వేల మెజార్టీ తగ్గదని, కావాలంటే తన యావదాస్తి పందెం కడతానని సవాల్ చేశాడు. వర్మ ధైర్యం చూశాక… పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకొన్నారు. లక్ష ఓట్ల మెజార్టీ రాకపోయినా.. కళ్లు బైర్లు కమ్మే అంకెలైతే కనిపించాయి. ఈ రకంగా వర్మ సక్సెస్ అయినట్టే.
పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు అనగానే చాలామంది సినిమావాళ్లు అక్కడ వాలిపోయారు. పవన్ కోసం ఇతోదికంగా ప్రచారం చేసి పెట్టారు. హైపర్ ఆదితో కూడిన జరర్దస్త్ టీమ్ ఊరూరా తిరిగింది. వాళ్లు ప్రజల్ని ఆకట్టుకోవడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఎస్కేఎన్, నాగవంశీ కూడా జనసేన జెండా పట్టుకొని ప్రచారం చేశారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. వీళ్లంతా పవన్ గెలుపుని కోరుకోవడమే కాదు, పిఠాపురం వెళ్లి తమ మద్దతు తెలియజేశారు. ఇక నాగబాబు సంగతి చెప్పాల్సిన పనిలేదు. అనుక్షణం పవన్ వెంటే ఉన్నాడు. తన సీటు కూడా త్యాగం చేసి, పవన్‌కు అండగా నిలబడ్డాడు. పవన్ గెలుపులో కచ్చితంగా వీళ్లందరి వాటా ఉంది. భీమవరం, గాజువాకలో చేసిన తప్పుల్ని పిఠాపురంలో చేయకుండా జనసైనికులు ప్రతి క్షణం పోరాటం చేశారు. ‘గెలుపు మనదేలే’ అని ఎక్కడా రిలాక్స్ అయిపోయలేదు. కౌటింగ్ కేంద్రం దగ్గర కూడా అప్రమత్తంగా వ్యవహరించారు. పిఠాపురం ప్రజల తీర్పు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కాపు ఓటింగ్ ఎక్కువ. అయినా అన్ని కులాల వారూ పవన్‌కు మద్దతు తెలిపారు. వైకాపా డబ్బులు వెదజల్లినా…నిజాయతీగా పవన్ పక్షం వైపు నిలబడ్డారు. ‘నాన్ లోకల్’ ట్యాగ్ అంటకట్టే ప్రయత్నం చేసినా, పవన్ మా వాడు అనుకొన్నారు. అందుకే పవన్ గెలుపు సాధ్యమైంది.