ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని భారీ ఆశలు పెట్టుకున్న సీట్ మెదక్. కానీ, ఫలితం బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నిరాశపరిచింది. గెలుపు అవకాశాలు ఉన్న మెదక్ లో కారు బోల్తా కొట్టడానికి కారణం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నా గజ్వేల్, దుబ్బాక నుంచి వెంకట్రామిరెడ్డికి మెజార్టీ రాకపోయినా, ఆ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్ధిపేట నుంచి
వచ్చే మెజార్టీ వెంకట్రాంరెడ్డిని ఈజీగా గట్టెక్కిస్తుందని అంతా లెక్కేశారు. కానీ, సిద్ధిపేటలో బీఆర్ఎస్ కు కేవలం 2 ,678 ఓట్ల మెజార్టీ రావడం ఆశ్చర్యపరిచింది. అక్కడ మొత్తం 1, 74, 969ఓట్లు పోలవ్వగా…బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు 62, 823ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 65, 501ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇక, సిద్ధిపేటతో పాటు గజ్వేల్… ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 22,571 ఓట్ల మెజార్టీ మాత్రమే రావడం గమనార్హం. ఇందులో 19,893 ఓట్ల ఆధిక్యం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నుంచి రాగా.. హరీష్ ఇలాకా నుంచి 2వేల ఓట్ల లీడ్ రావడం బీఆర్ఎస్ శ్రేణులను అవాక్కయేలా చేసింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు భారీ మెజార్టీ రాగా ఇప్పుడు ఆ మెజార్టీ అంతా బీజేపీ వైపు టర్న్ అయినట్లు స్పష్టం అవుతోంది.
ఓట్ల లెక్కింపు మొదలయ్యాక ఓ దశలో వెనుకంజలో ఉన్న వెంకట్రాం రెడ్డి సిద్ధిపేట ఓట్ల లెక్కింపు మొదలు కాగానే తిరుగులేని మెజార్టీ సాధిస్తారని అంచనా చేసినా ఆ లెక్క తప్పింది. దీంతో సిద్దిపేటలో లీడ్ అతి తక్కువ రావడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. హరీష్ కు- వెంకట్రాంరెడ్డికి మధ్య గతంలో విబేధాలు ఉన్నాయని… దాంతో ఆయన గెలుపు కోసం హరీష్ మనసు పెట్టి పని చేయకపోవడంతోనే స్వల్ప స్థాయిలో మెజార్టీ వచ్చింది అని, లేదంటే రికార్డ్ స్థాయి మెజార్టీ వచ్చి ఉండేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ మెదక్ లో ఓటమి పాలవ్వడానికి సిద్ధిపేటనే కారణమా..? అనే చర్చ జరుగుతోంది.