వైఎస్ జగన్మోహన రెడ్డి ఓటమికి వంద శాతం ఆయే కారణం. ఆయన అహంకారంతో ప్రజల్ని తక్కువ చేసి వారిని బిచ్చగాళ్లుగా భావించి.. పదివేలు ఇచ్చి ఏం చేసినా ఊరుకుంటారన్నట్లుగా చెలరేగిపోయారు. పరిపాలన, శాంతిభద్రతలు అత్యంత దిగువ స్థాయికి వెళ్లిపోయాయి. వ్యవస్థలు పని చేయడం మానేశాయి. వైసీపీ చెప్పిందే చట్టం.. రాజ్యాంగం అన్నట్లుగా మారిపోయింది. వీటన్నంటిపై ప్రజలు విసిగి వేసారిపోయారు. అందుకే ఓటుతో కొట్టారు.
అసెంబ్లీలో తాను ఆమోదించిన రాజధానిని సీఎం అయిన తరువాతా మూడు రాజధానుల పేరుతో మారిస్తే ప్రజలు ఊరుకుంటారా ?. ప్రజలకు ఇచ్చిన మాట తప్పి అమరావతిని నిర్వీర్యం చేస్తే ఊరుకుంటారా .. అప్పటికప్పుడు ప్రజలకు తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఉండకపోవచ్చు కానీ.. ఓటేసే రోజున తమదైన ప్రతాపం చూపిస్తారు. ఇప్పుడదే జరిగింది.
వైసీపీది చరిత్రలో కనీ వినీ ఎరుగని ఓటమి. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడం అంటే చిన్న విషయం. ఎంత వ్యతిరేకత ప్రజల్లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అధికారం ప్రజలు ఇచ్చింది పరిపాలించడానికే కానీ.. సొంత సంపాదనకు.. అవినీతికి.. ప్రతిపక్షాలను వేధించడానికి కాదు. ఆ విషయం జగన్ కు ప్రజలు ఇచ్చిన షాక్తో మరోసారి నిరూపితమయింది.