ఇంతకుమించిన పరాభవం మరో పార్టీ చవిచూడలేదేమో అన్న తరహాలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు అండగా నిలిచిన రాయలసీమ జిల్లాలు కూడా వైసీపీని దాదాపు వాష్ ఔట్ చేశాయి. సీమలోని 52 అసెంబ్లీ స్థానాలు ఉండగా వైసీపీ సింగిల్ డిజిట్ స్థానాలకు పరిమితం కావడంతో వైసీపీ ఉనికిపై చర్చ జరుగుతోంది.
ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని…సీమలో 52 స్థానాల్లో 45 స్థానాలు ఈజీగా కైవసం చేసుకుంటుందని లేక్కేశారు. కానీ, తలపండిన రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయని విధంగా కేవలం 7 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం కావడం ఆ పార్టీని షాక్ అయ్యేలా చేస్తోంది.
అధికారం కోల్పోయామన్న బాధకంటే.. సీమలో పట్టుకోల్పోయాం అనే బాధే ఆ పార్టీని కలిచివేస్తోంది. మొత్తం 11 సీట్లు గెలిచినా అందులో చివరి వరకు జగన్ పక్కన ఉండేది ఎవరో.. ఊడేది ఎవరో తెలియదు. దీంతో వైసీపీకి పూర్తి వెన్నుదన్నుగా నిలిచిన సీమ కూడా ఆ పార్టీని తిరస్కరించడంతో వైసీపీ ఎలా మనుగడ కొనసాగిస్తుందన్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
ఎందుకు సీమలో వైసీపీకి ఈ గతి పటిందని వైసీపీ నేతలు చర్చిస్తున్నారు. విజయమ్మ సైతం పోలింగ్ ముందు కడప లోక్ సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిలను గెలిపించాలని కోరడం, వైఎస్ వివేకా హత్య కేసు, సొంత చెల్లిని జగన్ విమర్శించడం, వైసీపీ నేతల మితిమీరిన ఆగడాలు, ప్రత్యర్ధి పార్టీల నేతలపై సానుభూతి… ఇవన్నీ వైసీపీని సీమలో సింగిల్ డిజిట్ కు పరిమితం చేసినట్లుగా తెలుస్తోంది.