న్యూడిల్లీ, 2012 మే 6: సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృద్విరాజ్ చౌహాన్ ఈరోజు చారిత్రాత్మక ఒప్పందం పత్రాలపై సంతకాలు చేసారు. రూ. 40,300 కోట్లతో నిర్మిస్తున్న ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు ద్వారా నీటి వినియోగానికి విధివిధానాలను ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రాణహిత నదిపై బ్యారేజి నిర్మించి సుమారు 16.4 లక్షల ఎకరాలకి 160 టి.ఎం.సి.ల నీళ్ళు అందించడం దాని ప్రధానోద్ధేశం. హైదరాబాద్ జంట నగరాలకు గోదావరి నదిపై శ్రీపాద ప్రాజెక్టు ద్వారా 20 టి.ఎం.సి.ల త్రాగు నీరు అందించడం కూడా ఇందులో ఇమిడి ఉంది.
ముంబై, 2016 మార్చి 8: తెలంగాణా మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులో భాగమయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మెడిగడ్డ బ్యారేజి నిర్మించి, తెలంగాణాలో 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ఒప్పందంలో ప్రధాన అంశం. దీనిపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేసారు.
***
న్యూ డిల్లీ, 2012 మే 6: ఈ రోజు ఇరు రాష్ట్రాల మధ్యన జరిగిన ఈ ఒప్పందం ద్వారా ప్రాణహిత-చేవెళ్ళ, లెండి, లోవర్ పెన్ గంగ ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయబడుతుంది.
ముంబై 2016 మార్చి 8: ఈ ఒప్పందం ప్రకారం లోవర్ పెన్ గంగ ప్రాజెక్టు క్రిందకు వచ్చే చనఖ-కొరాట, రాజపేట్-పెన్ పహాడ్ బ్యారేజీలు నిర్మించబడతాయి. వాటిలో రూ.1,200 కోట్లు వ్యయంతో చనఖ-కొరాట బ్యారేజి నిర్మాణానికి తెలంగాణా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
***
న్యూ డిల్లీ, 2012 మే 6: నదీ జలాల పంపకాలపై ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి, మరియు వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సహకరించుకొనేందుకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేయబడుతుంది.
ముంబై, 2016 మార్చి 8: గోదావరి, దాని ఉపనదుల జలాలను పంచుకోవడంపై ఎదురవుతున్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి, అలాగే ఇరు రాష్ట్రాలకి ఆమోదయోగ్యంగా మెడిగడ్డ బ్యారేజి ఎత్తుని నిర్ధారించడానికి ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయబడుతుంది.
***
న్యూ డిల్లీ, 2012 మే 6: ఈ కార్యక్రమానికి ఆంధ్రా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ ఇంకా అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు.
ముంబై, 2016, మార్చి8: ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శులు, ఇంకా అనేకమంది ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు.
****
ఏంటీ ఒకే సమాచారం ఉన్న వార్తని వ్యక్తుల పేర్లు, తారీఖులు మార్చి రెండు సార్లు రాయడం జరిగింది అనుకుంటున్నారా ? తెరాస అనుచరగణాల జేజేలుతో తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పుకుంటున్న “చరిత్రాత్మక ఒప్పందం” వెనుక రహస్యం ఇదే. సుమారు నాలుగేళ్ల క్రితమే అప్పటి ఆంధ్రా, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ ఒప్పందం జరిగింది. అప్పుడు రెండు రాష్ట్రాలలో, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండేది. కానీ ఆ ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితం అవడం చేత మళ్ళీ ఇప్పుడు తెలంగాణా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇంచుమించు అటువంటిదే కొత్తగా ఒప్పందం చేసుకొన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయంలో మొదలైన పనులను ఇప్పుడు మూడు విభిన్న పార్టీలు నడిపిస్తున్న ప్రభుత్వాలు కలిసి పూర్తి చేయడానికి నడుం బిగించాయి. అయిపోయిన పెళ్ళికి మళ్ళీ బాజాలు కొట్టించుకొని నేనే మొదలెట్టాను అని అనిపించుకోవాలనే రాజకీయ ప్రయోజనాలు అందుకునే ప్రయత్నం అయినా కూడా,ఈ ప్రయత్నంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సఫలం అవ్వాలని తద్వారా తెలంగాణా సస్యశ్యామలం కోరుకొందాము.