వైసీపీ నాలుగు ఎంపీ సీట్లను గెల్చుకుంది. కడప, రాజంపేట, తిరుపతి, అరకు నియోజకవర్గాల్లో వైసీపీ గెల్చింది. కడపలో అతి కష్టం మీద గెలిచింది. అరవై వేల వరకూ మెజార్టీ వచ్చింది. షర్మిల అనుకున్నంతగా ఓట్లు చీల్చలేకపోయారు. కనీసం రెండు లక్షల ఓట్లు తెచ్చుకున్నట్లయితే కడప కూడా టీడీపీ ఖాతాలో పడిపోయేది. టీడీపీ అభ్యర్థులతో చేసుకున్న ఒప్పందాలో.. మరో కారణమో కానీ.. అరవై వేల ఓట్లతో అవినాష్ రెడ్డి బయటపడ్డారు.
రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. ఓ దశలో గెలుస్తారని అనుకున్నారు. కానీ మిథున్ రెడ్డి ముందంజలోకి వెళ్లారు. ఆ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు ఎక్కువగానే ఉంటారు. అక్కడ బీజేపీ కాకుండా టీడీపీ, జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే వారన్న అభిప్రాయం ఉంది. ఇక తిరుపతి సెగ్మెంట్ ది మరో గాధ. అక్కడ కేవలం బీజేపీ గుర్తుపై ఓటు వేయలేక వైసీపీకి వేశారు. లక్షన్నరకుపైగా ఓట్లు క్రాస్ ఓటింగ్ జరగడం అంటే చిన్న విషయం కాదు. నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. కానీ ఓటర్లు రెండు లక్షల మంది బీజేపీకి ఓటు వేయడానికి సాహసించలేదు. వైసీపీకి వేశారు. ఫలితంగా ఆ సీటు పోయింది.
అరకు నియోజకవర్గంలోని పాడేరు, అరకు తప్ప అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. అయినా అక్కడ సీటు కొద్ది తేడాలో మిస్ అయింది. అక్కడ కూడా బీజేపీ సింబల్ కాకుండా టీడీపీ, జనసేన గుర్తుల్లో ఏదో ఒకటి ఉంటే కచ్చితంగా గెలిచి ఉండేవారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఈ మిస్టేక్స్ జరగకపోతే.. ఒక్క ఎంపీ సీటుకు వైసీపీ పరిమితమయ్యేది.