తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా..? ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కేసీఆర్ సర్కార్ ట్యాప్ చేసినట్లుగా జగన్ ప్రభుత్వం కూడా ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతల ఫోన్లను ట్యాప్ చేసిందా..?మరోసారి అధికారంలోకి రావాలనే ఎజెండాతోనే కేసీఆర్, జగన్ ప్లాన్ ప్రకారమే ట్యాపింగ్ కు పాల్పడ్డారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తెలంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తుండగా… ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ తరహాలోనే ఏపీలో వైసీపీ ఫోన్ ట్యాపింగ్ నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల ఫోన్లను వైసీపీ ప్రభుత్వం ట్యాప్ చేసిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగిన సజ్జల ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీని ఆధారంగా పలువురిని బెదిరించారని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మొదట తెలంగాణలో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తేలినా ఇప్పుడు ఆ జాడ్యం ఏపీలో కూడా కొనసాగిందన్న ఆరోపణల నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారమే కేసీఆర్ , జగన్ లు ఫోన్ ట్యాపింగ్ నేరానికి పాల్పడ్డారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.