అమరావతిలోని సచివాలయం నుండి డేటా చోరీ అవుతోందా? ఐటీ వింగ్ నుండి డేటా బయటకు వెళ్తుందా…? అంటే అవుననే అంటున్నాయి సచివాలయ వర్గాలు.
ప్రభుత్వం మారటంతో ఐటీ డేటా చోరీ అవుతుందన్న సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. డేటా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టడంతో పాటు అనుమానం ఉన్న చోట్ల తనిఖీలు చేపట్టారు. ఐటీ వింగ్ ఎస్పీ నేతృత్వంలో సోదాలు జరుగుతున్నాయి. ఐటీ సెక్షన్ వింగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఫైలింగ్ ద్వారా నడుస్తున్న ఫైల్స్ అన్నింటిని భద్రపర్చే వింగ్ వద్ద భారీగా పోలీసులను కాపలా ఉంచారు. అధికారం మారుతున్న నేపథ్యంలో, ఫైల్స్ మిస్సవకుండా ఉండేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఐటీ శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని బయటకు వెళ్లనీయకుండా… వారితో మాట్లాడుతున్నారు.
అయితే, ఇప్పటికే డేటా చోరీ అయ్యిందా…? లేదంటే ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారా…? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ-ఫైలింగ్ విధానాన్ని చంద్రబాబు వ్యతిరేకించిన నేపథ్యంలో, తాజా దాడులు చర్చనీయాంశం అవుతున్నాయి.