2019లో టీడీపీ దారుణ పరాభవం తర్వాత పార్టీ పని అయిపోయిందని, లోకేష్ తో పార్టీకి పునర్ వైభవం కష్టమేనని ఎవరికీ వారు తేల్చేశారు. లోకేష్ లో నాయకత్వ లక్షణాలు అసలే లేవన్న విశ్లేషణలు చేశారు. టీడీపీ సంక్షోభం నుంచి గట్టెక్కడం కష్టమేనని కొందరు.. తమదారి తాము చూసుకున్నారు. కానీ సంక్షోభ కాలంలోనే తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని లోకేష్ ఫిక్స్ అయ్యారు.
అలా నిర్ణయించుకుంది మొదలు.. మూడేళ్లపాటు జనంలోనే ఉంటూ వచ్చారు. అవిశ్రాంతంగా వైసీపీ సర్కార్ పై పోరాటం చేస్తూ వచ్చారు. కేసులు పెట్టినా, వేధించినా, అవమానించినా వెనక్కి తగ్గకుండా లక్ష్యం వైపు సాగారు. యువగళం పేరిట ఏపీ అంతటా పాదయాత్ర చేసి ప్రజల మన్ననలను పొందారు. తాజా ఎన్నికల్లో రికార్డ్ స్థాయి మెజార్టీతో గెలిచి లీడర్ గా లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు అదే పరిస్థితి జగన్ కు వచ్చింది.
మొదటిసారి జగన్ కు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే జగన్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ఎన్నడూ ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదు. వైసీపీ ఆవిర్భావమే ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది. వైఎస్సార్ సన్నిహిత నేతలు , అన్నింటికి మించి కుటుంబ సభ్యుల నుంచి వైసీపీకి మంచి సపోర్ట్ లభించింది. జగన్ అరెస్ట్ అయినా పార్టీని షర్మిల, విజయమ్మ అన్ని తానై నడిపించారు. 2014లో ఓడినా వైసీపీ నుంచి పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు గెలుపొందగా… 2019లో తిరుగులేని మెజార్టీ సాధించిన వైసీపీ 2024కు వచ్చేసరికి దారుణ పరాభవం చవిచూసింది.
జగన్ రాజకీయ జీవితంలో ఇలాంటి ఓటమి ఎదురౌతుందని బహుశ కలలో కూడా ఊహించి ఉండరు. కేవలం 11 మంది మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో పార్టీ ఉనికిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎవరు ఎప్పుడు హ్యాండిస్తారో తెలియని పరిస్థితి.దీంతో జగన్ రాజకీయంగా మొదటిసారి ఓ సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పైగా… అక్రమాస్తుల కేసులో ఏదైనా జరిగితే పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనేది అందరి సందేహం.
గతంలో తల్లి, చెల్లి పార్టీ బాధ్యతలను మోశారు కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో జగన్ అసలైన పరీక్షను ఇప్పుడు ఎదుర్కోబోతున్నారని విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. సంక్షోభ కాలంలోనే అవకాశాలను సృష్టించుకొని లీడర్ గా లోకేష్ నెగ్గారు… తన జీవితంలో మొదటిసారి ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జగన్ ఈ పరీక్షలో నెగ్గుతారా అనేది కాలమే తేల్చనుంది.