ఢిల్లీలో టీడీపీ చక్రం తిప్పే అవకాశం రావడంతో కీలక పదవులు లభించనున్నాయి. అవి ఏ పదవులు అన్న విషయం పక్కన పెడితే.. స్పీకర్, కేబినెట్ బెర్తులు లాంటివి టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఏ కీలక పదవి వచ్చినా మొదట చాయిస్ గా ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ఉండనున్నారు. చిన్న వయసులోనే ఎంపీ అయినా వరుసగా మూడో సారి గెలిచారు. పదేళ్లుగా జాతీయ రాజకీయాల్లో ఉండటం వల్ల ప్రముఖ నేతలందరికీ చిరపరిచితుడు.
హిందీ, ఇంగ్లిష్‌లలో అనర్గళంగా మాట్లాడటమే కాదు.. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన ఉన్న నేతగా గుర్తింపు ఉంది. స్పీకర్ లాంటి పదవికి కూడా ఆయన పేరు ఏ మాత్రం వెనక్కి పోదు. గతంలో ముగ్గురు ఎంపీలు ఉన్నా.. అన్ని వ్యవహారాలు రామ్మోహన్ నాయుడే చూసేవారు. ఇప్పుడు కీలకమైన పదవి దక్కే సమయం ఆసన్నమయిందని అంచనా వేస్తున్నారు.
టీడీపీకి ఎన్ని పదవులు వస్తాయన్నదాన్ని బట్టి.. ఇతరులకు పదవులు ఆధారపడి ఉన్నాయని అనుకోవచ్చు. ఈ సారి చాలా మంది కొత్త వారే .. మొదటి సారే ఎంపీలుగా ఎన్నికయ్యారు. పెమ్మసారని, గంటి హరీష్ మాధుర్, భరత్ వంటి వారంతా మొదటి సారే ఎన్నికయ్యారు. లావు కృష్ణదేవరాయులు రెండో సారి ఎంపీ అయినా టీడీపీ తరపున మొదటి సారి గెలిచారు.