తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తానని శపథం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లి విగ్రహం మార్చుతామని ఇదివరకే స్పష్టం చేసిన రేవంత్ డిసెంబర్ 9న నూతన విగ్రహ ఆవిష్కరణ ఉంటుందన్నారు. అరవై ఏళ్ల ఆకాంక్షను సాకారం చేసిన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహిస్తామని కీలక ప్రకటన చేశారు.
వాస్తవానికి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర గేయం ఆవిష్కరణతో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని మొదట వెల్లడించారు. కానీ, ఈ విషయంలో వివాదాలు చుట్టుముట్టడంతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను వాయిదా వేసుకున్నారు. తెలంగాణ తల్లి నూతన విగ్రహం ఎలా ఉండాలన్న దానిపై అందరితో చర్చించి ఏకాభిప్రాయం మేరకే నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాదు..రాష్రం అంతటా ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలా తెలంగాణ తల్లి ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించనున్నాయి.
రేవంత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వ్యూహాత్మకంగా కనిపిస్తున్నా…బీఆర్ఎస్ కు అస్త్రంలా మారే అవకాశం ఉందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి అంశాల్లో రేవంత్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరని.. ఆయన వ్యూహం మేరకే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర కంటే సోనియా గాంధీ త్యాగం ఎక్కువ ఉందని చాటే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.