చంద్రబాబు పనైపోయిందని ఎగతాళి చేయని నేతల సంఖ్య తక్కువ. కానీ వారంతా షెడ్డుకెళ్లిపోయారు కానీ.. చంద్రబాబు మాత్రం ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి ఎదుగుతూనే ఉన్నారు. దేశ స్థాయిలో మార్మోగిపోతున్న పేరు చంద్రబాబు. ఆయనకు ఇలాంటి విజయాలు కొత్త కాదు. కానీ ఈ విజయం మాత్రం ప్రత్యేకమైనది. తన రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు ఎలా పోరాడారో… నలభై ఏళ్ల రాజకీయ జీవితం అత్యున్నత పదవుల్ని చూసిన తర్వాత కూడా అలాగే పోరాడారు.
గెలుపోటముల్ని సమానంగా తీసుకునే చంద్రబాబు
“కష్టపడి పని చెయ్ ఫలితం దానంతట అదే వస్తుంది” అని చాలా మంది చెబుతూ ఉంటారు కానీ ఆచరించడం అంత సామాన్యమైన విషయం కాదు. ప్రయత్నాల్లో చిన్న ఎదురు దెబ్బ తగిలితే పూర్తిగా నీరుగారి పోతారు. పూర్తిగా కిందపడిపోతే ఇక నాకెందుకు అనుకునేవారే ఉంటారు. కానీ కిందపడినా… మళ్లీ లేచి పరుగెట్టే వాళ్లే లక్ష్యాన్ని చేరుకుంటారు. నిజానికి ఇలాంటి స్ఫూర్తితో ఉండేది.. కొత్తగా ఏమీ సాధించని వారే. ఏదో ఒకటి సాధించాలని అనుకుంటారు. అదే జీవితంలో ఎంతో సాధించిన వారికి ఎదురు దెబ్బలు తగిలితే ఇక ఎందుకులే అనుకుంటారు. కానీ వీటన్నింటికీ అతీతం చంద్రబాబు. ఓటములకు ఆయన కుంగిపోరు. పోరాటాన్ని వదిలి పెట్టరు. 2014లో గెలిచిన తర్వాత ఐదేళ్లలో సమర్థమైన పాలన చేశానని సంక్షేమం, అభివృద్ధి.. కొత్త రాష్ట్రానికి అమరావతి లాంటి రాజధానిని నిర్మిస్తున్నానని.. పోలవరం కలను సాకారం చేస్తున్నానని అనుకున్నారు. ప్రజలందరికీ ఫ్రీ బస్సులు పెట్టి మరీ చూపించారు. కానీ ఆయన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. మామూలుగా అయితే ఎవరైనా డీలాపడిపోతారు. కానీ చంద్రబాబు మాత్రం అలా ఎప్పుడూ అనుకోలేదు. మళ్లీ ప్రజల కోసం పోరాటం ప్రారంభించారు.
వేధింపులతో కన్నీళ్లు – దాన్నే పట్టుదలగా మార్చి పోరాటం
చంద్రబాబును వేధించారు. మాటలతో హింసించారు. మానసికంగా నరకాన్ని చూపే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పలేదు. రాజకీయాలతో సంబంధం లేని భార్యను… తాను రాజకీయ భిక్ష పెడితే ఎమ్మెల్యేలు అయిన వారు అత్యంత దారుణంగా తూలనాడితే .. కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ అలాంటి సభకు సీఎంగానే వస్తానని చాలెంజ్ చేసి వెళ్లారు. అంతే కానీ… ఈ ప్రజలు తనను ఇలా ఓడించి… అవమానించేలా చేస్తున్నారని వారిపై నింద వేయలేదు . గత ప్రభుత్వ పాలనకు.. ప్రస్తుత పాలనకు తేడా చెబుతూ జనంలోకి వెళ్లారు. అనుకున్న ఫలితం సాధించారు.
అభివృద్ధి రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్
చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు… ఆయన చేసిన పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ఆయన సంస్కరణతో ఉద్యోగాలు సాధించుకున్న వారు కుటుంబాలను బాగు చేసుకున్న వారు ఇదేం కుట్రలని బాధపడ్డారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలున్న ప్రతి మధ్యతరగతి కుటుంబం ఆయన వేసిన పునాదుల్ని.. ఆయన పడిన కష్టాన్ని అందరితో పంచుకున్నారు. అది చంద్రబాబునాయుడు బ్రాండ్. రాజకీయాలంటే ప్రజలకు మేలు చేయడానికేనని నమ్మే లీడర్. చంద్రబాబు చేసిన కృషికి… ఓ తరం యువత రాత మార్చేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎవరూ కాదనలేరు. ఇప్పుడు ప్రతీ చోటా ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. విభజిత ఏపీని ఎలా అభివృద్ధి చేయాలో ఆయన కలలు కన్నారు. వాటిని ఎగ్జిక్యూట్ చేసే దశలో అధికారం కోల్పోయారు. పోరాడి మళ్లీ విజయాన్ని అందుకున్నరు.
నిరంతర రాజకీయ శ్రామికుడు చంద్రబాబు
చంద్రబాబు 14 ఏళ్లకుపైగా సీఎంగా ఉన్నారు. మిగిలిన కాలం అంతా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అత్యంత చిన్న వయసులో మంత్రిగా చేశారు. ఆయన చూడని పదవి లేదు.. అనుభవించని అధికారం లేదు. ఇప్పుడు ఆయన సీఎం కావడం ఆయనకు ముఖ్యం కాదు.. ఏపీకి ముఖ్యం.. ఏపీ భవిష్యత్ కు ముఖ్యం. అదే విషయాన్ని ప్రజలు చెప్పి మరోసారి పదవిని పొందగలిగారు. కష్టపడి లక్ష్యాన్ని సాధించడంలో చంద్రబాబు యువతకు ఓ రోల్ మోడల్. జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలో .. ఎలా కష్టపడాలో కెరీర్ లో ఎదగాలనుకునేవారికి చంద్రబాబు ఓ రోల్ మోడల్. తీసుకునే నిర్ణయాలు ఇప్పటికికాదు పదేళ్ల ముందు చూపుతో ఉండాలని ఆలోచించే వారికి చంద్రబాబు ఓ రోల్ మోడల్. రాజకీయాల్లో ఆయనో యూనివర్శిటీ. నిరంతర రాజకీయ శ్రామికుడు.