పొట్టి ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చేసింది. బలహీనమైన ఐర్లాండ్ ని 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. బౌలర్లకు, బ్యాట్సర్లకు కావల్సినంత ప్రాక్టీస్ లభించింది. ముఖ్యంగా బుమ్రా, సిరాజ్ పదునైన బంతులతో ఆకట్టుకొన్నారు. ఇదే స్టేడియంలో తదుపరి మ్యాచ్ పాకిస్థాన్‌తో తలపడబోతోంది భారత్. కాబట్టి… పిచ్, వాతావరణం విషయాల్లో భారత్ కు కాస్త అవగాహన ఏర్పడొచ్చు. అది ప్లస్ పాయింట్.
అయితే.. ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడిన రోహిత్ శర్మ అర్థ సెంచరీ పూర్తయిన తరవాత రిటైర్డ్ హట్ గా వెనుదిరిగాడు. అప్పటికే భారత్ విజయం ఖాయం అయ్యింది కాబట్టి, ఎవరూ ఆందోళన చెందలేదు. కానీ ఆ గాయం పెద్దదైతే, కీలకమైన పాక్ పోరుకు రోహిత్ అందుబాటులో లేకపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే రోహిత్ భుజం నొప్పితో బాధ పడుతున్నాడని, గాయం అంత ప్రమాదకరమైనది కాదని, పాక్ తో మ్యాచ్‌కు రోహిత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉంటాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకొన్నారు. టీ 20 వరల్డ్ కప్ ఇప్పటి వరకూ చాలా చప్పగా సాగింది. అన్నీ ఏక పక్ష మ్యాచ్‌లే. అయితే ఈ టోర్నమెంట్‌కు భారత్ – పాక్ పోరుతో ఊపొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత టీ 20 వరల్డ్ కప్ లో భారత్ – పాక్ మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ఆ పోరులో భారత్ గెలిచింది. ఈసారీ అదే తరహా ఆట తీరు ఇరు జట్లూ ప్రదర్శించాలని అభిమానులు కోరుకొంటున్నారు.