టీవీ9 అంటే ఓ బ్రాండ్. రవిప్రకాష్ పెట్టిన పుట్టలోకి పాముల్లా కార్పొరేట్ శక్తులు దూరాయి. అప్పట్నుంచి ఆ చానల్ తీరు మారిపోయింది. తాము ప్రజలకు సమాచారాన్ని ఇవ్వడం కాదని.. తాము వారి అభిప్రాయాలను మార్చేస్తామన్నట్లుగా వ్యవహరించడం ప్రారంభించారు. అదే కార్పొరేట్ శక్తుల గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఎన్టీవీ కూడా అంతే.
బీఆర్ఎస్కు భజన చేస్తూ .. గ్రౌండ్ రియాలిటీని తెలియకుండా చేశారు. ప్రజలు కూడా ఈ రెండు చానళ్లను చూసి.. ఆగ్రహంతో రగిలిపోయేవారు. జరుగుతోంది ఒకటి అయితే ప్రచారం చేస్తోంది మరొకటా అని. ఈ పరిస్థితి వారిలో ఆగ్రహాన్ని పెంచింది. చివరికి ఓట్ల సునామీ రూపంలో బయటకు వచ్చింది. టీవీ9 తాము ఏదో ఎగ్జిట్ పోల్ చేసినట్లుగా పోల్ స్ట్రాట్ పేరుతో రెండు సార్లు ఫలితాలు ప్రకటించింది. సిగ్గు ఉన్న చానల్ అయితే..తెలంగాణది తప్పు అయినప్పుుడు ఏపీది ప్రకటించకూడదు. కానీ ప్రకటించింది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర మీడియాది. కానీ ప్రతిపక్ష నేతల్ని విమర్శిస్తూ అధికార పార్టీ నేతల్ని పొగుడుతూ.. చేసిన ప్రచారంతో.. రెండు చానళ్లు తమ విశ్వసనీయత కోల్పోయాయి. రేటింగుల్లో తాము ముందున్నామని జబ్బులు చరుచుకోవచ్చు కానీ… తాము ప్రచారం చేసిన దానికి భిన్నంగా వచ్చిన ప్రజాతీర్పు చూసి వారు మీడియా రంగం నుంచి వెళ్లిపోతే మంచిది.
ఏతావాతా తేలిందేమిటంటే.. మీడియాలో చెప్పే వాటిలో నిజానిజాలేమిటో ప్రజలు సులువుగా గ్రహించగలరు. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మీడియా మెలగాల్సి ఉంది.