సెంట్రల్ లో ఈసారి ఏ పార్టీకి మెజార్టీ రాదని పక్కాగా విశ్లేషించిన కేసీఆర్..16 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుదామని ఆశ పడ్డారు. కానీ, సరైన సమయంలో బీఆర్ఎస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ విశ్లేషించినట్టుగానే సెంట్రల్ లో ఈసారి ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. 16 స్థానాల్లో విజయం సాధిస్తే కేంద్రంలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషించేదే. కానీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తం ఊడ్చుకుపోయింది. దీంతో కేంద్రంలో చక్రం తిప్పాలకున్న కేసీఆర్ ఆశలు ఆడియాశలు అయ్యాయి. కానీ ఏపీలో టీడీపీ 16 సీట్లు నెగ్గడంతో చంద్రబాబు కేంద్రంలో కింగ్ మేకర్ గా మారారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.
కేసీఆర్ జనాల్లో విశ్వసనీయత కోల్పోవడమే బీఆర్ఎస్ పతనావస్థకు కారణం అనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే 2019 లోక్ సభ ఎన్నికల్లో కారు – సారు- పదహారు- ఢిల్లీలో సర్కార్ అంటూ హడావిడి చేసిన కేసీఆర్ ఆ తర్వాత మళ్ళీ ఆ ఊసే ఎత్తలేదు. అంతకుముందు కూడా ఫెడరల్ ఫ్రంటూ భారీ ప్రయత్నాలు చేసి సైలెంట్ అవ్వడం, 2019 కు వచ్చేనాటికి కేంద్రంలో బీఆర్ఎస్ పాత్రపై జనాలకు విశ్వసనీయత సన్నగిల్లేలా చేసింది. అదే 2024ఎన్నికల ఫలితాల్లో ప్రస్పుటమైంది. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీకి మెజార్టీ రాదని, బీఆర్ఎస్ కు 16 సీట్లు ఇవ్వండి..కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పినా గత అనుభవాల దృష్ట్యా కేసీఆర్ వాదనను తెలంగాణ ప్రజలు విశ్వసించలేదు.
కానీ, ఏపీలో టీడీపీకి 16 లోక్ సభ స్థానాలు దక్కడంతో చంద్రబాబు కేంద్రంలో కింగ్ మేకర్ అవుతున్నారు. కేసీఆర్ కు అవకాశం ఉన్నప్పటికీ ఆయన విశ్వసనీయత కోల్పోవడంతో సువర్ణావకాశం కోల్పోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకం అవుతోన్న క్రమంలో…కేంద్రంలో బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం అవ్వడం బీఆర్ఎస్ కు ఊపిరిపోసే పరిణామమే. కానీ, కేసీఆర్ జనాల్లో విశ్వసనీయత కోల్పోవడం బీఆర్ఎస్ కు మైనస్ గా మారింది.
కేసీఆర్ తరహాలో చంద్రబాబు మాత్రం పరిస్థితుల ఆధారంగా కప్పదాటు నిర్ణయాలు తీసుకోకుండా విశ్వసనీయత పొందటంతో ఇప్పుడు కింగ్ మేకర్ అవుతున్నారు. అందుకే రాజకీయాల్లో విశ్వసనీయత అనేది చాలా అవసరం.. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పెద్దలు ఇప్పటికైనా గుర్తిస్తారో లేదో చూడాలి.