ఏపీలో టీడీపీ ఘన సాధించడం విజయం సాధించడంతో తెలంగాణలో పార్టీ ఎదుగుదలపై చంద్రబాబు తిరిగి ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కౌంటింగ్ కు ముందు ఇరు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలతో భేటీ సందర్భంగా తెలంగాణలో పార్టీ భవితవ్యంపై చంద్రబాబు ఆరా తీశారు. తెలంగాణలోనూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంపై దృష్టిపెడుతానని చంద్రబాబు నేతలకు హామీ ఇవ్వడంతో రాష్ట్ర నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి.
ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. ప్రాంతీయ వాదంతో రాజకీయాలు చేయడం, సెంటిమెంట్ రాజకీయాలు కూడా వర్కౌట్ కాకపోవడం బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పైగా పార్టీ పేరును కూడా మార్చడంతో బీఆర్ఎస్ ఎదుగుదల కష్టతరంగా మారడంతో ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పార్టీ పునర్ నిర్మాణంపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు… బీఆర్ఎస్ స్థానం టీడీపీ భర్తీ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో టీడీపీని నేతలు వీడారు కానీ, క్యాడర్ అలాగే ఉందని దీంతో పార్టీ ఎదుగుదలపై ఫోకస్ చేస్తే క్యాడర్ యాక్టివ్ అవుతుందని భావిస్తున్నారు.
పైగా.. కేంద్రంలోనూ చంద్రబాబు కింగ్ మేకర్ గా మారుతుండటంతో బీఆర్ఎస్ లోకి వలస వెళ్ళిన నేతలంతా భవిష్యత్ వెతుకులాటలో భాగంగా టీడీపీలోకి వస్తారని అంచనాలు ఉన్నాయి. దీంతో త్వరలోనే తెలంగాణ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అవుతారని.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాష్ట్ర అద్యక్షుడిని నియమించి దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అవసరమైతే తనతో టచ్ లో ఉంటూ పార్టీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఓ ఇంచార్జ్ ను కూడా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.