తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయ దిగ్గజం. తన క్లాస్ ను ఏపీ ఎన్నికల్లో మరోసారి చూపించారు. బీజేపీ, జనసేనతో పొత్తులు పెట్టుకోడమే కాదు ఓట్లు ఈజీగా ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేశారు. దానికి ఆయన అనుసరించిన వ్యూహం ఓ మోడల్ మారనుంది.
ఏపీలో ఎన్డీఏ కూటమి ఓట్ల బదిలీ జరిగితేనే మంచి ఫలితాలు సాధిస్తుందని మూడు పార్టీల నేతలకూ తెలుసు. బీజేపీ ఆరు లోక్ సభ స్థానాల్లో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. జనసేన రెండు పార్లమెంట్, ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశాయి. టీడీపీ 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ చోటా మూడు పార్టీలపై ఓటర్లలో స్పష్టమన అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో గాజు గ్లాస్ గుర్తు గందరగోళం కూడా వచ్చింది. కానీ ఒక్క సారి ప్రచారం ప్రారంభించిన తర్వాత ఎలాంటి సమస్యలు కనిపించలేదు. స్మూత్ గా ప్రచారం చేసుకుపోయారు. మూడు పార్టీల మధ్య వివాదాలు సృష్టించాలని వైసీపీ వైపు నుంచి కొన్ని వ్యూహాలు అమలయ్యాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం విషయంలో అనేక పుకార్లు కూడా రేపారు. ఏదీ నిలబడలేదు. అంతా సాఫీగా సాగిపోయింది.
కూటమిగా మారిన తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన సానుభూతిపరులుగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్న అనేక మంది కూటమికి వ్యతిరేకంగా మాట్లాడారు. తక్కువ సీట్లు తీసుకున్నారని విస్తృతంగా ప్రచారం చేశారు. పవన్ అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బీజేపీకి ప్రత్యేకంగా ఓటు బ్యాంక్ లేదు .. ఆ పార్టీ తరపున సోషల్ మీడియాలో మాట్లాడేవారే కూడా వైసీపీ సానుభూతిపరులే. అందుకే లైట్ తీసుకున్నారు.
కూటమిలో ఏ గుర్తుకు ఓటు వేసినా తమ అభిమాన పార్టీకి వేసినట్లే అన్న అభిప్రాయాన్ని వంద శాతం కల్పించడంలో సక్సెస్ అయ్యారు.
ఎలక్షనీరింగ్ విషయంలో కూటమిలో అన్ని పార్టీల కన్నా.. టీడీపీపై ఎక్కువ బాధ్యత తీసుకుంది. జనసేన సానుభూతిపరుల్ని పూర్తి స్థాయిలో ఓటింగ్ కు వచ్చేలా చూసుకుంది. ఈ విషయంలో చంద్రబాబు తనదైన మార్క్ చూపించారు. కూటమికి తిరుగులేని విజయం లభించింది.