ఇప్పుడు నవలా చిత్రాలు దక్కిపోయాయి కానీ ఒకప్పటి క్లాసిక్స్ అన్నీ నవలు ఆధారంగా వచ్చినవే. ప్రముఖ నిర్మాత డా.డి రామానాయుడు కెరీర్ ని మలుపు తిప్పింది కూడా నవలా చిత్రమే. ఆయన నిర్మాతగా నిలదొక్కుకుంటున్న సమయంలో ‘బొమ్మలు చెప్పిన కథ’, ‘సిపాయి చిన్నయ్య, ద్రోహి సినిమాలు వరుసగా నిరాశ పరిచాయి. ఒక్కసారిగా నష్టాల్లో కురుకుపోయారు. అయితే ”పోయిన దగ్గరే వెదుక్కోవాలి” అనేది నాయుడి సిద్దాంతం. సరిగ్గా ఇదే సమయంలో కౌసల్యాదేవి రాసిన ‘ప్రేమనగర్’ నవలని సినిమాగా తీయాలని డిసైడ్ అయ్యారు.
కానీ చేతిలో తగిన డబ్బు లేదు. ’10 లక్షలు పెట్టుబడి పెట్టి సహకరించండి. 5 లక్షలు నేను పెట్టుకుంటాను” నవయుగవాళ్ళుని కలిశారు. ”మీరు అసలే నష్టాల్లో వున్నారు. రిస్కు తీసుకుంటున్నారు. బాగా ఆలోచించుకోండి” అని వాళ్ళు వారించినా ”ఇది నా ఆఖరి ప్రయత్నం. తప్పక సక్సెస్ అవుతాను.” అంటూ మొండి పట్టుదలతో ‘ప్రేమనగర్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
”నిర్మాతగా నా భవిష్యత్తును నిర్ణయించే సినిమా ఇది. మద్రాసులో ఉండాలా లేక మహాబలిపురం వెళ్లి వ్యవసాయం చెయ్యాలా అని నిర్ణయించే సినిమా కూడా ఇదే. అంతా మీ చేతుల్లోనే వుంది” అంటూ షూటింగ్ సమయంలో టీం అందరిని ఉత్తేజపరిచేవారు నాయుడు. ఆయన నమ్మకం నిజమైయింది . ‘ప్రేమనగర్’ సూపర్ హిట్. భారీ వర్షాల సమయంలో విడుదలైన ఆ సినిమాకి కలెక్షన్ల వర్షం కురిసింది. ఇక అక్కడి నుంచి ఆయన పట్టిందల్లా బంగారమే.
(ఈ రోజు డా.డి రామానాయుడు జయంతి)