తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం సీనియర్ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ పుస్తకం ‘డేట్ లైన్ హైదరాబాద్’ ఆవిష్కరిస్తూ గతానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. విద్యుచ్చక్తి సమస్య తెలంగాణలో ఎంత తీవ్రంగా వుందో ప్రత్యక్షంగా గమనించాను గనకే తాను 1985లో మొదటిసారి ఎంఎల్ఎ అయినప్పుడు ఇతర సభ్యులతో కలసి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు సమస్య వివరించి స్లాబ్ సిస్టం వచ్చేందుకు కృషి చేశానన్నారు. రామారావు గారికి ఒకసారి సమస్య అర్థమైతే ఇక పరిష్కారం వచ్చేదాకా వూరుకోరు అనగానే సభలో చప్పట్లు మార్మోగాయి. మా మాటలు ఆయనకు ఎక్కాయి. అంతే. విద్యుత్ బోర్డు చైర్మన్ నార్ల తాతారావు అభ్యంతరాలను కూడా కాదని సభలో ప్రకటన చేసేందుకు సిద్ధపడ్డారు.
తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో శ్లాబ్‌ను 18 నుంచి 85కు పెంచాలని నిర్ణయించినప్పుడు నేను గంటన్నర పైగా అడ్డుపడ్డాను. చివరకు 35కు పెంచాలని తేల్చారు. అయితే 2000లో దాన్ని హఠాత్తుగా మరిన్ని రెట్లు పెంచడమే గాక మూడేళ్లపాటు ఏటేటా 15 శాతం పెంచుతుండాలని ప్రకటించడంతో అప్పటికప్పుడే నిరసన లేఖ రాశాను. అంతేగాని చాలా మంది అనుకునేట్టు నేను మంత్రి పదవి రానందువల్ల అలిగి బయిటకు రాలేదు అని వివరించారు.
తను ఏ పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమ పునరుద్దరణకు అంగీకరించానో చెబుతూ ఆంధ్రా గో బ్యాక్ అన్న నినాదంతో హ్యూమన్ ఫేస్ లేకుండా పోతుందని తాను మొదటే దాన్ని నిరాకరించినట్టు చెప్పారు. 3000 గంటలకు పైగా చర్చలు జరిపాకనే ఈ ఉద్యమం ప్రారంభించానని తెలిపారు.ఈ మధ్య మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాము. అందరం భారతీయులమే. రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే వైఖరి వుండాలి. అమరావతి వెళ్లినప్పుడు కూడా చంద్రబాబుకు ఇదే విషయం చెప్పి నాకు తోచిన సలహాలు ఇచ్చాను. వివాదాల వల్ల ప్రయోజనం లేదు అన్నారు. దేశంలోని 39 పార్టీలకు తెలంగాణ విషయమై నచ్చజెప్పడానికి తనకు కేంద్ర మంత్రి పదవి ఉపయోగపడిందని, అప్పట్లో తను ఎవరిని పిలిచినా బిర్యానీ పెట్టడం, తెలంగాణ క్యాసెట్ వినిపించడం రెండే చేస్తానని జోకులు నడిచాయని అన్నప్పుడు చప్పట్లు వినిపించాయి.
తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నమైన గన్‌పార్కు దగ్గర సులభ్ కాంప్లెక్సు ఏర్పాటుచేయాలని చంద్రబాబు భావించినప్పుడు వ్యతిరేకించిన సంగతి మాత్రం ప్రస్తావించారు. జర్నలిజంలో విమర్శలు కూడా అవసరమేనని అలాటి వారు వుంటేనే అప్రమత్తత వుంటుందని కూడా చెప్పారు. సీనియర్ సిటిజన్లతో ఏదైనా ఆలోచనా వ్యవస్థ ఏర్పాటు చేస్తే బావుంటుందని పొత్తూరి వెంకటేశ్వరరావును ఉద్దేశించి చెప్పారు. మొత్తంపైన ఈ సభలో కెసిఆర్ చాలాసేపు పాత విషయాలు చెప్పి సభికులను ఆకట్టుకున్నారు.వాటిపై ఏవైనా భిన్నాభిప్రాయాలకు అవకాశం వున్నప్పటికీ ఆయన చెప్పిన తీరు మాత్రం అలరించింది.