సివిల్ సర్వీస్ అధికారులుగా ఉండి… తప్పుడు పనులు చేసి వణికిపోతున్న అధికారులకు ఇప్పుడు గుబులు పట్టుకుంది. తమ తప్పులు దొరికిపోతాయని వదిలి పెట్టరని అర్థమైపోయింది. కనీసం మర్యాదపూర్వకంగా బోకే ఇస్తామని బతిమాలుతున్నా.. వారికి ఇంటి గేటు దగ్గరకు పర్మిషన్ లభించడం లేదు. కనీసం ఇలా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కలిపి ఇరవై మందికిపైగా ఉంటారని అంటున్నారు. వీరు చేసినవి చిన్న చిన్న తప్పులు కాదు.
చంద్రబాబును ఇరికించడానికి అత్యంత ఘోరమైన పనులకు పాల్పడ్డారు. సుమన్ బోస్ అనే సీమెన్స్ ఉన్నతాధికారి పక్కన శవాన్ని పెట్టి తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారంటే ఎలాంటి ఘోరాలకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. తోటి అధికారుల్ని బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారు. చివరికి లిక్కర్ స్కామ్ పేరుతో సీఈవోగా ఉన్న మీనాను సైతం హెచ్చరించారు. ఇలాంటి వారందరికి రానున్న రోజుల్లో ఎలాంటి ట్రీట్ మెంట్ లభిస్తుందోనన్న భయం వారిలో ఉంది.
అందుకే కొంత మంది వీఆర్ఎస్ ఆలోచనల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. భవిష్యత్ పై భయం కదలాడుతూండటంతో పీఎస్ఆర్ ఆంజనేయులు వీఆర్ఎస్ కు దరఖాస్తు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన బాటలోనే చాలా మంది ఉన్నారు. కనీసం తమ వీఆర్ఎస్ ను అయినా ఆమోదించాలని వారు ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరబోతున్నట్లుగా చెబుతున్నారు. అయితే వారిని అంత తేలికగా వదలరని టీడీపీ వర్గాలంటున్నాయి.