ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కార్యకర్తలపై దాడులు చోటు చేసుకుంటున్నాయని పేర్ని నాని, వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఆ పార్టీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బృందంలో ఓ కీలక నేత మిస్ అయ్యారు. వైసీపీ హయాంలో అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణా రెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ పరాభవం తర్వాత సజ్జల కనిపించరని, జగన్ కు కూడా దూరంగా ఉంటారని విపక్షనేతలు ముందే చెప్పారు. భవిష్యత్ పరిణామాలను ముందే అంచనా వేసి పార్టీతో సంబంధం లేనట్లుగా ఆయన దారి ఆయన చూసుకుంటారని విశ్లేషించారు. సొంత పార్టీ నేతలు కూడా కొంతమంది సజ్జల వైఖరిపై ఇదే అభిప్రాయంతో ఉన్నా.. సజ్జలకు జగన్ వద్దనున్న ప్రాధాన్యతను చూసి ఈ విషయం జగన్ కు వివరించేందుకు వెనకడుగు వేశారనేది ఓపెన్ సీక్రెట్. అయినా, జగన్ మాత్రం సజ్జల సూచనలను తప్పక పాటించేవారని అదే పార్టీని ఓటమి వైపు నడిపించిందని ఆపార్టీ నేతలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి స్పష్టం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బృందంలో సజ్జల కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారం కోల్పోవడంతో తనకేం సంబంధం లేదన్నట్లుగా సజ్జల అప్పుడే సర్దేశారా..? లేక ఇప్పటికప్పుడు మీడియా ముందుకు రావడం ఇష్టం లేకే ఆగిపోయారా..? అని సజ్జల వైఖరిపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.