ఏపీలో వైసీపీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా కనిపిస్తోంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కకపోవడంతో నేతల్లో కలవరం మొదలైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తట్టుకొని పార్టీ స్ట్రాంగ్ అవ్వడం కష్టమేనని భావిస్తోన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పెదవి విరుస్తుండగా .. కొంతమంది పార్టీని వీడెందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నేత రావెల కిషోర్ బాబు పార్టీకి గుడ్ బై చెప్పగా.. మరికొంతమంది నేతలు ఆ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యేలు భవిష్యత్ వెతుకులాటలో భాగంగా టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సీమ జిల్లాలో జగన్ కు అండగా నిలిచిన నేతలు సైతం వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరడమో, లేదంటే షర్మిల సారధ్యంలో కాంగ్రెస్ లో చేరడమో చేస్తారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.
ఇన్నాళ్ళు వైసీపీని ఆదరించిన సీమ ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఈడ్చికొట్టింది. కేవలం ఏడు స్థానాల్లో మాత్రం గెలుపొందటంతో సీమలోనూ వైసీపీ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని దాంతో నేతలు పక్కచూపులు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ కూటమిలోకి వెళ్ళలేని వారు కాంగ్రెస్ ను తమ ఆప్షన్ ను ఎంచుకోనున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే వైసీపీ పునాదులు కదలనున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.