వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో… మోడీతోనూ అలాగే స్నేహపూర్వకంగా ఉంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. ఎన్నికలకు ముందు ఎన్డీయేలోనే ఉన్నామని, ఇప్పుడు కూడా ఉంటామన్న లోకేష్ ఇండియా కూటమి ఆహ్వానించినా పునరాలోచించేది లేదని ఇండియా టుడే రాజ్ దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.
టీడీపీకి ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేసిన ఎన్డీయే కూటమి నుంచి వైదొలగబోమని స్పష్టం చేశారు లోకేష్. తమకు పదవులు ముఖ్యం కాదని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని .. చంద్రబాబు పిలుపునిచ్చినట్లుగా స్టేట్ ఫస్ట్ నినాదంతో రాష్ట్రాభివృద్ది కోసం పాటు పడుతామని వ్యాఖ్యానించారు.
కేంద్రంలో టీడీపీ కింగ్ మేకర్ కావడంతో మోడీ కేబినెట్ లో కీలక పదవులను టీడీపీ ఆశిస్తుందన్న ప్రచారంపై లోకేష్ ఈ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. తమకు పలానా మంత్రి పదవులు కావాలని బీజేపీ ముందు షరతులు విధించలేదని…తాము ఎలాంటి షరతులు లేకుండానే బీజేపీకి సెంట్రల్ లో మద్దతు ఇచ్చామన్నారు.
పదవుల కోసం రాజీపడి రాష్ట్ర అభివృద్ధిని విస్మరించబోమన్న లోకేష్…అభివృద్ధితో పాటు సంక్షేమమే టీడీపీ ఎజెండా అని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వస్తే 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. వైసీపీ ఓటమితో మూడు రాజధానుల ముచ్చటకు ఎండ్ కార్డు పడినట్లేనని ఒక రాష్ట్రం ఒకే రాజధాని అదే అమరావతి అని స్పష్టం చేశారు.