Satyabhama Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ 2.25/5
-అన్వర్
కాజల్.. టాప్ లీగ్ హీరోయిన్. దాదాపు అగ్ర హీరోలందరితోనూ జతకట్టింది. అయితే సీనియారిటీ మీదపడితే సహజంగానే గ్లామర్ పాత్రలు దూరమైపోతాయి. ఆమెతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ ఎప్పుడో లేడి ఓరియంటెడ్ సినిమాల్లోకి షిఫ్ట్ అయ్యారు. పెళ్లి తర్వాత సినిమాల జోరుకి కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఇప్పుడు లేడి ఓరియంటెడ్ కథ ‘సత్యభామ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్ ట్రైలర్ లో ఆడియన్స్ లో ఆసక్తిని పెంచాయి. మంచి ట్రాక్ రికార్డ్ వున్న శశికిరణ్ తిక్క ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ కావడంతో మరింత ద్రుష్టిని ఆకర్షించింది. మరి క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన సత్యభామ పంచిన థ్రిల్ ఏమిటి? కాజల్ కి తొలి సోలో హిట్ పడిందా?
సత్య అలియాస్ సత్యభామ (కాజల్) షి టీమ్‌లో ఏసీపీ కేడర్. డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్. అమ్మాయిలని ఏడిపించే దుండగులపై ఉక్కుపాదం మోపుతుంది. తన వద్దకు వెళితే న్యాయం జరుగుతుందనే నమ్మకం అమ్మాయిల్లో కల్పిస్తుంది. షి టీమ్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో హసీనా అనే అమ్మాయి సాయం కోసం సత్యభామ దగ్గరికి వస్తుంది. తన భర్త యాదు (అనిరుథ్ పవిత్రన్) చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సత్యతో చెబుతుంది. పిర్యాదు ఇచ్చిన మరుసటి రోజే హసీనా ని దారుణంగా చంపి పారిపోతాడు యాదు. ఈ హత్య సత్యభామని మానసికంగా కలిచివేస్తుంది. యాదుని ఎలాగైనా పట్టుకొని శిక్షించాలని నిర్ణయించుకున్న సత్యకు ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి? యాదు దొరికాడా? లేదా? ఈ కేసు చేధనలో ఎలాంటి మలుపులు వచ్చాయి? ఇవన్నీ తెరపై చూడాలి.
‘ఒక చావు.. ఒకరిలో పశ్చాత్తాపం మిగిలిస్తే.. మరొకరిలో పగని రగిలించింది’.. సత్యభామ కథ సెంట్రల్ ఐడియా ఇది. ఓ క్రైమ్ థ్రిల్లర్ ఇలాంటి ఐడియాతో రావడం ఆసక్తికరమే. అయితే పశ్చాత్తాపం, పగ పెంచుకున్న పాత్రల ప్రయాణం ఎంత కొత్తగా, విలక్షణంగా ఉన్నాయన్నదానిపైనే థ్రిల్ ఆధారపడి వుంటుంది. సత్యభామలో ఆ థ్రిల్ ఫ్యాక్టరే గాడి తప్పింది.
‘కాళికాదేవి కోపం.. సీతాదేవి శాంతం’ అంటూ సత్యభామ పాత్రని పరిచయడంతో ఈ కథ మొదలౌతుంది. సత్య షీ టీం లీడర్ గా ఆకతాయి ముఠాని పట్టుకోవడం, చీరకట్టులో స్టేషన్ కి వచ్చి నేరస్తులతో నిజం చెప్పించిన సన్నివేశం సత్యభామపై అంచనాలు పెంచుతాయి. హసీనా పాత్ర పరిచయం, ఆమె చుట్టూ వున్న పాత్రలు, సంఘర్షణ చూస్తున్నప్పుడు ఏదో బలమైన సామజిక అంశాన్నే చూపించబోతున్నారనిపిస్తుంది. అయితే హసీనా చావుతో ఈ కథ గమనమే మారిపోతుంది. జీవితంలో అసలు చావే చూడని పోలీస్ ఆఫీసర్ లా అవసరానికి మించి పశ్చాత్తాపపడుతూ సాగే సత్యభామ ప్రయాణం చాలా చోట్ల నీరసంగా వుంటుంది. ఆమె అంతలా పశ్చాత్తాపం చెందడానికి ఓ కారణం చూపినప్పటికీ అది బలవంతపు ఎమోషన్ లానే వుంటుంది కానీ సహజంగా కుదరలేదు.
ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. అయితే ఇందులో జరిగే నేర పరిశోధన మాత్రం ఓ గంధరగోళం డ్రామా తయారైయింది. ఆ పరిశోదనని పరిశీలించి చూస్తే .. ఈ సినిమాకి టైటిల్ సత్యభామ కాకుండా ‘ఇక్బాల్ మిస్సింగ్’ యాప్ట్ అనిపించే అవకాశం వుంది. ఒక దశలో సత్యభామ పాత్రని సైడ్ ట్రాక్ పట్టించి ఇక్బాల్ ట్రాకే మెయిన్ ట్రాక్ గా మారిపోతుంది. థ్రిల్లర్స్ లో ట్విస్ట్ లు వుండాలి. ఇందులో కూడా ట్విస్ట్ లు వున్నాయి కానీ ప్రేక్షకుడిని కన్ ఫ్యుజన్ లో పడేస్తాయి. ప్రతి సన్నివేశానికి ఓ రెండు కొత్త పాత్రలు పరిచయమై మళ్ళీ అడ్రస్ లేకుండా పోతాయి. ఇందులో వర్చువల్ వీడియో గేమింగ్ మీద ఓ పెద్ద ఎపిసోడే వుంది. గేమింగ్ గురించి తెలియని వారికి అదొక అయోమయం వ్యవహరంలా మారిపోతుంది.
తొలిసగంతో పోల్చుకుంటే రెండో సగంలో గంధరగోళం మరీ ఎక్కువైయింది. హ్యూమన్ ట్రాఫికింగ్, టెర్రరిజం అంటూ ఏవేవో సన్నివేశాలు వచ్చిపడుతుంటాయి. ప్రేక్షకులు థ్రిల్ ఇచ్చేయాలనే దర్శకుడి ఉబలాటం బాగానే వుంది కానీ మరీ ఇంత గంధరగోళం చేసేయడం థ్రిల్లర్స్ ఆడియన్స్ కి కూడా నప్పుదు. ప్రధాన పాత్రల చుట్టూ వుండే సస్పెన్స్ క్లై మాక్స్ లో రివిల్ అవుతుంది. కానీ అది రివిల్ చేసిన తీరు చూసినప్పుడు ..అసలు ఇదీ ఒక సస్పెన్సా ? దిన్ని ట్విస్ట్ అన్ని ఫీలవ్వాలా ? అనే క్వశ్చన్ మార్క్ ప్రేక్షకుడి ముఖంలో వుంటుంది. అంతకుమంచి క్వశ్చన్ మార్క్ ఫేస్ లో క్యారెక్టర్స్ పేజీల పేజీల డైలాగ్స్ చెప్పుకుంటూ జరిగిన కథనంతా విప్పి.. మ మ అనిపించడం థ్రిల్లర్స్ ని ఇష్టపడే ఆడియన్స్ అంతగా రుచించదు.
కాజల్ కి ఇది కొత్త పాత్రే. యాక్షన్ సీన్స్ లో పడిన కష్టం కనిపించింది. అయితే పోలీస్ పాత్రలు సరిపడే బాడీ లాంగ్వేజ్ ని కాజల్ ఇంకా డెవలప్ చేసుకోవాలి. యాక్షన్ సీన్స్ లో ఆమె చేతులు సుకుమారంగా తిరగడం గమనించవచ్చు. అలాగే దర్శకుడు ఆ పాత్ర చుట్టూ రాసుకున్న సన్నివేశాల్లో అంత బలం లేదు. క్రైమ్ ని చేధించే క్రమంలో ఆమె ఎదురుకున్న సవాళ్ళు పెద్దగా కనిపించలేదు. కాజల్ భర్తగా కనిపించిన నవీన్‌చంద్ర వాయిస్ తో ఈ కథ మొదలౌతుంది, అయితే ఆయన పాత్ర కూడా పెద్ద ప్రాధాన్యత కనిపించలేదు. ప్రకాశ్‌రాజ్, హర్షవర్ధన్, నాగినీడు లాంటి చక్కని నటులు రెండు మూడు డైలాగులకు పరిమితమయ్యారు. యాదు, ఇక్బాల్, హసీనా పాత్రల్లో చేసిన నటులు పర్వాలేదనిపిస్తారు.
శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం చక్కగా కుదిర్చాడు. కథని ఇంతో కొంత ఆసక్తిగా నడిపింది ఆయన బీజీఎంనే. కెమరాపనితనం డీసెంట్ గా వుంది. చాలా మాటలు రైమింగ్ కోసం రాసినట్లే వుంటుంది. కథనంలో శశికిరణ్ తిక్క చాలా మలుపులు రాసేసుకున్నారు. అందులో కొన్ని రిజిస్టర్ అయ్యాయి. ఇంకొన్ని తేలిపోయాయి. చాలా వరకూ అయోమయం, గందరగోళం గా మారాయి.
తెలుగు360 రేటింగ్ 2.25/5
-అన్వర్