వైసీపీ నేతలను సవాళ్ల రాజకీయం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీ మరోసారి గెలుస్తుందనే అతి విశ్వాసంతో సవాల్ చేసిన నేతలు వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో సవాల్ కు కట్టుబడాలనే డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని సవాల్ చేసి ఓడిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకుంటానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో గెలవడంతో సవాల్ కు కట్టుబడుతూ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకునేందుకు గెజిట్ ప్రకటన కోసం పత్రాలు సిద్ధం చేసుకున్నట్లు ఇటీవలే ప్రకటించడంతో తాజాగా మరో నేత సవాల్ కు కట్టుబడాలని ఒత్తిడి పెరుగుతోంది.
ముద్రగడ పద్మనాభం తరహాలోనే వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని కూడా సవాల్ చేశారు. మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో తను ఓటమి పాలవ్వడమే కాకుండా వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో కొడాలి నాని గతంలో చేసిన సవాల్ కు కట్టుబడాలని టీడీపీ శ్రేణులు నాని ఇంటిని ముట్టడించాయి.
కొడాలి నాని సవాల్ చేసి తోక ముడవడం కాదు… దమ్ముంటే మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు టీడీపీ నేతలను బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్న ఆయన తీరు పట్ల జనాల్లో అసహనం వ్యక్తమైంది. వీటిని సైతం అంచనా వేయని నాని, వైసీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేసి ఇప్పుడు తనే బుక్ అయ్యారు. దీంతో ఆయన సవాల్ కు కట్టుబడుతూ రాజకీయ సన్యాసం చేయాలంటూ డిమాండ్ లు పెద్దఎత్తున వస్తున్నాయి.