మా జగన్ ఏం చేస్తారో అని వైసీపీ ఎంఎల్ఎలు కొందరు ఆందోళన వ్యక్తం చేసినట్టు నేను శాసనసభా సమావేశాలకు ముందే రాశాను. గవర్నర్ ప్రసంగం తర్వాత రోజు వరకూ కొంత ఫర్వాలేదుగాని ఆ పైన షరామామూలుగా తయారైంది పరిస్థితి. ఆరోపణలతో ఇరుకున పడాల్సిన పాలక పక్షం వ్యూహాలకు ప్రతిపక్షం ప్రతివ్యూహం అనుసరించలేకపోయింది.రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలు ఆరోపణలు జగన్ ప్రస్తావించగా ఆధారాలు వుంటే మంత్రులను డిస్మిస్ చేస్తానని ముఖ్యమంత్రి సవాలు విసిరారు. లేదంటే మీరు క్షమాపణలు చెప్పాలని, ఈ విషయం తేలిన తర్వాతనే ఇతర అంశాలు తీసుకోవాలని తీవ్ర స్వరంలోనే ప్రకటించారు. ముఖ్యమంత్రి స్వయానా ఇలా అనడం అరుదైన వ్యూహమే. అయితే ఆ వ్యూహాన్ని తగు వాదనలతో ఎదుర్కోవడానికి జగన్ సిద్ధం కాలేదు. మీరే దందాలో కీలక పాత్రధారి అని అన్నారు. మైకు ఇవ్వలేదని సమర్థన చేసుకున్నా – మైకులో మాట్లాడినప్పుడు కూడా సిబిఐ విచారణ కోరడం తప్ప మరో వాదన రాలేదు. ఆధారాలివ్వడంపై సభ వెలుపల చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటివారు చేసిన వాదనలు కూడా జగన్ వినిపించలేదు. ఆరోపణలు లేవనెత్తాక సంబంధిత పత్రాలు సభాపతి టేబుల్‌పై వుంచడం, లేదా సభా సంఘం అడగడం, సంయుక్త సభాసంఘం(జెపిసి) కోసం పట్టుపట్టడం అనేక అవకాశాలున్నాయి. బోఫోర్స్ కుంభకోణంపై కూడా మొదట జెపిసి నడిచింది. సిబిఐ దర్యాప్తు రాజకీయంగా లేదా న్యాయపరంగా జరగాల్సిన నిర్ణయం. అందుకు నిరాకరించిన ప్రభుత్వం మరో విధంగా విచారణ జరిపిస్తామని గాక ఏ విచారణ చేసేది లేదు పొమ్మంటూ తప్పించుకుంది.
ఈ సమస్య నుంచి బయిటపడటానికి వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం సహజమే. ప్రభుత్వానికి మెజార్టి వుంటుంది గనక అవి నెగ్గకపోయినా చర్చ సందర్భంలో విమర్శ చేయడానికి అవకాశముంటుంది. అయితే ఇక్కడ వైసీపీ నోటీసు వెనక మరో పరమార్థం కూడా వుంది. పెద్దసంఖ్యలో తమ ఎంఎల్ఎలు తెలుగుదేశంలోకి ఫిరాయించిన నేపథ్యంలో వారిని ఇరకాటంలో పెట్టడానికీ, వున్నవారంతా నమ్మదగిన వారేనా అని తేల్చుకోవడానికి ఇదో మార్గంగా ఎంచుకున్నారు. విప్ జారీ చేసేట్టయితే దాన్ని ఉల్లంఘించడం అనర్హతకు దారి తీస్తుంది కూడా. అందుకే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాసం కన్నా తన పార్టీపై పట్టును చాటుకోవడమే జగన్ ఉద్దేశంగా కనిపిస్తుంది.మొదట స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం ఇస్తామన్న వారు తర్వాత ప్రభుత్వంపైనే ఇవ్వడం రాజకీయ విమర్శలకు కూడా ఉపయోగపడుతుందనుకుని నోటీసు ఇచ్చారు. అయితే ఆ సమయంలోనైనా జగన్ ఇతర సీనియర్లకు సమర్థులకు తగినంత అవకాశం ఇస్తారా లేక తనే ఏకధాటిగా మాట్లాడతారా అన్నది చూడవలసిందే.