ఏపీలో జగన్మోహన్ రెడ్డి కేర్ టేకర్ సీఎంగా ఉండగానే ఆయన ప్రభుత్వంలోని అవినీతి పుట్ట బద్దలవుతోంది. ఐదేళ్ల పాటు మద్యం వ్యాపారాన్ని గుప్పిట పట్టిన వాసుదేవరెడ్డి అనే అధికారి ఫైళ్లు దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయారు. సీఐడీ కేసు నమోదు చేసి హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది. దాదాపుగా రూ. పది కోట్ల విలువ చేసే విల్లాలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది.
ఈ వాసుదెవరెడ్డి ఐఏఎస్ కాదు.. ఐపీఎస్ అంత కంటే కాదు. అసలు ఆయన ఏపీ ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఆయన ఐఆర్టీఎస్ ఆఫీసర్. అంటే రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. దక్షిణ మధ్య రైల్వేలో పని చేస్తూ వైసీపీ నేతలతో పరిచయాలు పెంచుకున్నారు. ఆయనను పావుగా వాడుకోవాలని వైసీపీ నేతలు డిసైడవడంతో తనకూ వాటాలు దక్కుతాయని వాసుదేవరెడ్డి ఆశపడ్డారేమో కానీ డిప్యూటేషన్ మీద ఏపీకి వచ్చేశారు.
వచ్చినప్పటి నుంచి మద్యం స్కాం చేశారు. చివరికి ఓడిపోయే ముందు చంద్రబాబు మీద తప్పుడు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు ఆ పాపం పండిపోయింది. వైసీపీ ఓడిపోవడంతో ఆయన రైల్వే ట్రాఫిక్ కు పారిపోవాలనుకున్నారు. తన అవినీతి వ్యవహారాల ఫైల్స్ మొత్తం కనిపించకుండా చేయాలనుకున్నారు. కానీ దొరికిపోయారు. ఈ వ్యవహారంలో టీడీపీకి స్పష్టమైన సమాచారం ఉండటంతో.. చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.