తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడంలో ఎక్స్ పర్ట్. ఎలాంటి సందర్భాల్లోనూ ఆయన బయటపడరు. అసెంబ్లీలో వంద మందికిపైగా వైసీపీ ఎమ్మెల్యేలు తన కుటుంబాన్ని, భార్యను కించ పరుస్తున్నప్పుడు బరస్టరయ్యారు. ఆ తర్వాత రామోజీరావు అంత్యక్రియల సమయంలో మరోసారి ఆయన కన్నీరు పెట్టుకున్నారు. రామోజీరావు అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యారు. స్మృతి వనం వద్ద రామోజీ భౌతిక కాయాన్ని వాహనం నుంచి దింపినప్పటి నుండి పాడె మోశారు. చితికి నిప్పు పెట్టే వరకూ అన్ని పనుల్లో భాగం అయ్యారు. ప్రతి క్షణం చంద్రబాబు కంట కన్నీరు వస్తూనే ఉంది. ఆపుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
రామోజీరావుతో చంద్రబాబుకు ఎలాంటి అనుబంధం ఉందన్న సంగతి బయట ప్రపంచానికి తెలియదు. ఎప్పుడూ వారి బహిరంగంగా సమావేశం అయింది లేదు. కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రామోజీరావు మోరల్ సపోర్ట్ చేశారు. అలాగే చంద్రబాబుకు కూడా ఆయన మద్దతు ఇచ్చారు. అమరావతికి ఆ పేరు పెట్టంది రామోజీరావేనని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. అదే నిజం కూడా . రామోజీరావు సూచనల మేరకే అమరావతి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు కూడా.
ఇక పాలనా పరంగా.. రాజకీయాల పరంగా రామోజీరావు సూచనలు ఇచ్చేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మంచిని, ధర్మాన్ని మాత్రమే పాటించాలని చెబుతారని అన్నారు. మొత్తంగా రామోజీరావు సలహాలతో చంద్రబాబు రాజకీయంగా ఎంతో మేలు పొంది ఉంటారు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా కూడా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అందుకే … చంద్రబాబు ఆయన అంతిమ యాత్రలో కన్నీరు పెట్టుకోకుండా ఉండలేకపోయారు.