ఏపీలో ప్రభుత్వం మారడంతో కొద్ది రోజులుగా టీటీడీ చైర్మన్ ఎవరనే అంశం హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ సారధ్యంలోని కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో టీటీడీ చైర్మన్ పదవిని పొందేందుకు మూడు పార్టీల నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
టీటీడీ చైర్మన్ పదవి జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. సీట్ల సర్దుబాటులో భాగంగా ఆయన నరసాపురం ఎంపీ టికెట్ ను త్యాగం చేశారని అందుకే ఈ పదవిని నాగబాబుకు అప్పగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ నేత వర్మ పేరు కూడా పరిశీలనలో ఉందని.. ఆయనకు పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
బీజేపీ నుంచి పార్టీ మాజీ అద్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పొత్తులో భాగంగా తిరుపతి సీటును త్యాగం చేసిన భాను ప్రకాష్ కూడా టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అటు, టీడీపీ నుంచి కూడా పలువురు రాయలసీమ నేతలు ఈ పదవిని కోరుతుండటంతో టీటీడీ చైర్మన్ నియామకం చంద్రబాబుకు పెద్ద టాస్క్ లా మారనున్నట్లు తెలుస్తోంది.