నిన్నటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఇండియా గెలిచింది.120 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్ల పుణ్యంతో కాపాడుకోగలిగింది. చావుతప్పి కన్నులొట్ట పోయినట్లుగా గట్టేక్కెసింది. ఈ మ్యాచ్ లో ఇండియా బ్యాటింగ్ వింతగా అనిపించింది. కొత్త పిచ్ అని అందరికీ తెలుసు. అనూహ్యంగా వుంది. అంచనా అందడం లేదు. అయితే నిన్న మన బ్యాటర్లు ఆడిన తీరు విస్తుపోయేలా వుంది. రోహిత్, విరాట్ అవుట్ అయిన విధానం చూస్తే పిచ్ వలన కాదు.. రాంగ్ షాట్ సెలక్షన్ వలనే అని అర్ధమౌతుంది.
తర్వాత కూడా పిచ్ అనుకూలంగానే వుంది. పంత్, అక్షర్ ఆడిన తీరు చూస్తే ఒక దశలో రెండు వందల పరుగులు దాటుతుందనే అంచనాలు వచ్చాయి. కానీ ఒక్కసారిగా పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. అక్షర అవుట్ అయిన తర్వాత ఎవరూ కాసేపు క్రీజ్ లో కుదురలేకపోయారు. దాదాపు అన్నీ రాంగ్ షాట్ లే. పంత్ కొట్టిన దాదాపు షాట్లు గాల్లోనే వున్నాయి. చాలా సార్లు అవుట్ నుంచి తప్పించుకున్నాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా మంచి షాట్లు ఆడలేకపోయారు.
ఏడు వికెట్ వరకూ ఆల్ రౌండర్లుతో బలంగా కనిపించిన ఇండియా ఇరవై ఓవర్లు ఆడలేకపొయిందంటే నిర్లక్ష్యం అర్ధం చేసుకోవచ్చు. పాక్ బౌలర్లు పోనీ అద్భుతంగా బౌల్ చేసి వికెట్ టు వికెట్ బంతులు వేసి ఇబ్బంది పెట్టారా.. అంటే లేదు. కవ్వించే బంతులు వేసి వికెట్లు కొల్లగొట్టారు. నిన్నటి మ్యాచ్ లో మన బ్యాటింగ్ లో డొల్లతనం స్పష్టంగా కనిపించింది. వెంటనే ఈ లోపాలని సరిచేసుకోవాల్సిన అవసరం మన బ్యాటర్లపై వుంది. ఇలాంటి పొరపాట్లు గ్రూప్ దశ దాటిన తర్వాత పునారావృతం అయితే కష్టం.