బాలకృష్ణని వెండితెరపై చూపించాలంటే బోయపాటి తర్వాత ఎవరైనా అనే అభిప్రాయం అందరిలో కలిగింది. నిజంగా బోయపాటి కూడా బాలయ్యలోని మాస్ ఎనర్జీని ఒడిసిపట్టుకున్నారు. బాలయ్యని ఎలా చూపిస్తే విజల్స్ పడతాయో అనే కిటుకు భలే పట్టుకున్నారు. అయితే వీరసింహరెడ్డితో ఈ రేసులో తానూ ఉన్నానంటూ ముందుకొచ్చాడు గోపీచంద్ మలినేని. అందులో ఆయన బాలయ్యని ప్రజెంట్ చేసిన తీరు అందరికీ నచ్చింది. ముఖ్యంగా బ్లాక్ అండ్ బ్లాక్ లో బాలయ్యని చూపించడం, గెడ్డం, హెయిర్ స్టయిల్.. ఇవన్నీ పక్కాగా కుదిరాయి.
ఇప్పుడు బాబీ బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. బాబీ కూడా మంచి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడే. ఈ రోజు బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా గ్లింప్స్ వదిలారు. బాలయ్య యాక్షన్ మార్క్ లో టీజర్ కట్ చేశారు. ఆయన పాత్రకు కావల్సినంత ఎలివేషన్ ని ఈ టీజర్ సెట్ చేసింది. ముఖ్యంగా బాలయ్య లుక్ ని తీర్చిదిద్దిన విధానం బావుంది. ఈ విషయంలో బాబీకి ఫుల్ మార్కులు పడిపోయినట్లే. చివర్లో కనిపించిన హార్స్ షాట్ లో బాలయ్య గర్జన అదిరిపోయింది. మొత్తానికి ఫ్యాన్స్ కొరుకునే విధంగానే బాలయ్యని ప్రజెంట్ చేస్తున్నారు బాబీ.
అయితే బాలయ్య టీజర్ అనగానే ఒక డైలాగ్ జనాల్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి డైలాగ్ ఏదైనా టీజర్ లో ఉటుందని ఫ్యాన్స్ ఆశించారు. అదొక్కటి తప్పితే మిగతాదంతా వీరమాస్ అనిపించేసింది.